Share News

యూనియన్‌ బ్యాంక్‌ కేసులో మరో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:45 AM

యూనియన్‌ బ్యాంక్‌ యాదమరి శాఖలో వెలుగుచూసిన రూ.65 లక్షల విలువైన బంగారు తాకట్టు లోన్ల అక్రమాల కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా మరో ముగ్గురు ముద్దాయిలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ ఈశ్వర్‌ తెలిపారు.

యూనియన్‌ బ్యాంక్‌ కేసులో మరో ముగ్గురి అరెస్టు

యాదమరి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): యూనియన్‌ బ్యాంక్‌ యాదమరి శాఖలో వెలుగుచూసిన రూ.65 లక్షల విలువైన బంగారు తాకట్టు లోన్ల అక్రమాల కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా మరో ముగ్గురు ముద్దాయిలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ ఈశ్వర్‌ తెలిపారు. గత ఏడాది నవంబరులో 24మంది ఖాతాదారుల బంగారు నగల తనఖా విషయంలో అవకతవకలు జరిగినట్లు యూనియన్‌ బ్యాంకు అంతర్గత ఆడిట్‌లో బయటపడింది. దీనిపై గత డిసెంబర్‌ 6న యాదమరి పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.మొదట ఆరుగురు నిందితులను గుర్తించారు. వీరిలో ఏ1 అబ్బూరి భాస్కర్‌ ఆచారి, ఏ6 పటాలం మురళిని ఇప్పటికే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపించగా, వారికి కోర్టు కండీషన్‌ బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుల్లో ఒకరైన ఏ4 భువనేశ్వరి అనారోగ్యంతో మృతిచెందారు.తాజాగా మిగిలిన ముగ్గురు ముద్దాయిలు ఏ2 అవినాష్‌, ఏ3 మాలిక్‌, ఏ5 దర్శినిలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.మరోవైపు 24 మంది ఖాతాదారుల రూ.65 లక్షల బంగారు ఆభరణాలు రికవరీ అయ్యాయి.కోర్టు ఆదేశాల మేరకు బ్యాంక్‌ సిబ్బంది సంబంధిత ఖాతాదారుల లోన్‌ మొత్తాన్ని చెల్లించిన అనంతరం ఆభరణాలు అప్పగించే ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

Updated Date - Sep 26 , 2025 | 01:45 AM