Share News

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

ABN , Publish Date - May 19 , 2025 | 01:33 AM

జోరుగా కురుస్తుండిన వాన అప్పుడే వెలిసింది. అంతే ఇళ్ల నుంచి బయటికెళ్లి ఆటలు మొదలుపెట్టారో ముగ్గురు పిల్లలు. ఆ ఆటలే వారిని ‘ముంచేశాయి’. నీటికుంటలో నిండిన వాన నీరు వారి ఊపిరి తీసింది.

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
చిన్నారులను మింగిన నీటికుంట

కకుప్పం, మే 18 (ఆంధ్రజ్యోతి): జోరుగా కురుస్తుండిన వాన అప్పుడే వెలిసింది. అంతే ఇళ్ల నుంచి బయటికెళ్లి ఆటలు మొదలుపెట్టారో ముగ్గురు పిల్లలు. ఆ ఆటలే వారిని ‘ముంచేశాయి’. నీటికుంటలో నిండిన వాన నీరు వారి ఊపిరి తీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం మండలం దేవరాజపురంలోని చర్చి సమీపంలో ఎస్సీ సామాజిక వర్గం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో పక్క పక్కన ఉండే గుడిసెల్లో ఉంటున్న తిరుపతి వరలక్ష్మిల కుమార్తె గౌతమి (7), రాజ, సుమతిల కుమార్తె షాలిని (6), శరవణ, యశోదల కుమారుడు అశ్విన్‌ (7)లు సమీప బంధువులు. ఈ ముగ్గురు పిల్లలు కలిసే బడికి వెళ్లడం, ఆటలాడటం చేసేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నుంచే ఈ ప్రాంతంలో వాన కురుస్తోంది. మూడు గంటలకు కాస్త తెరపి వచ్చింది. వర్షం ఆగగానే ముగ్గురూ కూడబలుక్కుని గుడిసెల్లోంచి పొలోమంటూ బయటపడ్డారు. ఆపక్కనే చర్చి, దానిని దాదాపుగా ఆనుకుని ఇటీవలనే ఏదో కట్టడంకోసం తీసిన గోతిలో నిండిన వాననీరు. ఆ నీటిని చూసి సంబరపడిపోయారు పిల్లలు. అక్కడికెళ్లి ఆటల్లో పడ్డారు. కుంటలో దిగి, ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. ఇంతలో కాలుజారిందో, మరేమయ్యిందో కానీ నీటికుంటలో మునిగిపోయారు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో కుంటనుంచి బయటకు రాలేక, సాయం అందక ఊపిరాడక మృతి చెందారు. తర్వాత కుటుంబీకులు వారి శరీరాలకు అంటిన మట్టిని తుడిచి.. ఇళ్లలోని పాత గుడ్డలతో చుట్టి పడుకోబెట్టిన దృశ్యాలను చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. విషయం తెలుసుకున్న కుప్పం అర్బన్‌ సీఐ శంకరయ్య, సిబ్బందితో సాయంత్రం దేవరాజపురం చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసి, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

తక్షణ సాయంగా రూ.లక్ష

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.లక్ష అందించడానికి అధికారులు ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధి కింద అదనపు సాయం అందించడానికి కృషి చేస్తామని ప్రభుత్వం విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ హామీ ఇచ్చారు. సాయం అందించడంపై సీఎంకు, కంచర్లకు కుప్పం టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ ధన్యవాదాలన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - May 19 , 2025 | 01:33 AM