అసంతృప్తిలో ఆ మూడు మండలాలు!
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:27 AM
చిత్తూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పుంగనూరు నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. నగరి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిర్ణయాన్ని చంద్రబాబు సరిదిద్దుతారని ఆశపడితే తీవ్ర నిరాశకు గురి చేశారంటున్నారు.
జిల్లా పునర్విభజనపై ఇదీ జనాభిప్రాయం
చిత్తూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పుంగనూరు నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. నగరి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిర్ణయాన్ని చంద్రబాబు సరిదిద్దుతారని ఆశపడితే తీవ్ర నిరాశకు గురి చేశారంటున్నారు.
రొంపిచెర్లకు పీలేరే అనుకూలం
పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కొత్తగా ఏర్పాటుకానున్న మదనపల్లె జిల్లాలో కలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల మండలాలు మదనపల్లె జిల్లాలో కలవగా.. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు చిత్తూరు జిల్లాలోనే కొనసాగించనున్నారు. నాలుగు మండలాల ప్రజలు తమకు చిత్తూరు కంటే మదనపల్లె చాలా దగ్గర అంటున్నారు. పులిచెర్ల మండల వాసులు కూడా తమ మండలాన్ని చిత్తూరు జిల్లాలో కొనసాగించడం పట్ల సంతోషపడుతున్నారు. రొంపిచెర్ల విషయంలో మాత్రం ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మండలానికి పీలేరు అన్నివిధాలా అనుకూలంగా ఉన్నా, చిత్తూరులో ఉంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హామీని ఎందుకు మరిచారు?
వైసీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాను విభజించినప్పుడు నగరి నియోజకవర్గంలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాకు, పుత్తూరు, వడమాలపేట మండలాలను తిరుపతి జిల్లాకు కేటాయించింది.నగరి నుంచీ చిత్తూరుకు 75 కిలోమీటర్లు కాగా తిరుపతి 60 కిలోమీటర్లు. నిండ్ర, విజయపురాల నుంచీ చిత్తూరు 90 కిలోమీటర్లు వుంటే తిరుపతి 80 కిలోమీటర్లు. చిత్తూరుతో పోలిస్తే తిరుపతి చేరువ. రవాణా సదుపాయాలు మెరుగ్గా వున్నాయి. విద్య, వైద్య అవసరాలకు చిత్తూరు కంటే తిరుపతిపై ఎక్కువ ఆధారపడుతున్నారు ఈ మూడు మండలాల ప్రజలు. దీనికి తోడు గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పాదయాత్ర సమయంలో లోకేశ్, స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో విలీనం చేస్తామని హామీలిచ్చారు.క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అనుకూలంగా సిఫార్సు చేసినా హామీని నెరవేర్చకపోవడం పట్ల మూడు మండలాల ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.టీడీపీ శ్రేణులు సైతం నైరాశ్యంలో పడ్డాయి.
రెవెన్యూ సమస్యలు సులువుగా పరిష్కారం
పుంగనూరు నియోజకవర్గాన్ని మళ్లీ మదనపల్లె రెవెన్యూ డివిజనులో కలపడం హర్షణీయం. పుంగనూరు జమీందార్లకు సంబంధించిన భూసమస్యల్ని గతంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ అధికారులు సులువుగా పరిష్కరించేవారు. పలమనేరు డివిజన్‌లో కలిపిన తర్వాత అక్కడి అధికారులు ఇబ్బంది పడేవారు. పుంగనూరుకు పక్కనే ఉన్న మదనపల్లె జిల్లాకేంద్రం కావడం, పుంగనూరు ఆ జిల్లాలో కలవనుండడం సంతోషకరం.
- శరత్, న్యాయవాది, పుంగనూరు
మదనపల్లె కంటే చిత్తూరే దగ్గర
పులిచెర్ల మండలాన్ని చిత్తూరు జిల్లాలోనే కొనసాగించడం మాకు సౌకర్యమే. ‘మా మండలాన్ని చిత్తూరు జిల్లాలో కొనసాగించండి. లేదంటే తిరుపతి జిల్లాలో కలిపేయండి’అని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చాం. 80 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లె కన్నా, 40 కిలోమీటర్లలోని చిత్తూరు జిల్లా కేంద్రం మాకు దగ్గర.
-గోపి నాయుడు, ఎల్లంకివారిపల్లె, పులిచెర్ల మండలం
పీలేరు డివిజన్ సౌకర్యవంతం
సదుం మండల ప్రజలు గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 60 కిలోమీటర్ల దూరంలోని పలమనేరు ఆర్డీవో వద్దకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు సదుం మండలాన్ని పీలేరు రెవెన్యూ డివిజన్‌లో కలపడంతో ఆ సమస్య ఉండదు. జిల్లా కేంద్రం కూడా చిత్తూరు కంటే మదనపల్లె మాకు అనుకూలం.
-నజీర్, సదుం
రొంపిచెర్ల విషయం బాధాకరం
పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలపడం సంతోషకరమే. కానీ, మా రొంపిచెర్ల మండలాన్ని చిత్తూరులో కొనసాగించడం బాధాకరం. మాకు చిత్తూరు 50 కిలోమీటర్ల దూరంలో వుంటే పీలేరు డివిజన్ కేంద్రం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. రొంపిచెర్లను చిత్తూరులో కాకుండా పీలేరు డివిజన్‌లో కలపాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు.
-అమరనాథ రెడ్డి, జగడంవారిపల్లె, రొంపిచెర్ల మండలం
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నగరి, పుత్తూరు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో చంద్రబాబు, లోకేశ్, గాలి భానుప్రకాష్ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం దారుణం. హామీ నిలబెట్టుకోవాలి.
- గణేష్ పిళ్లై, విశ్రాంత ఉద్యోగి, నిండ్ర
పునఃపరిశీలన చేయాలి
నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతిలో కలిపే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పునఃపరిశీలించాలి. లేకుంటే విద్యార్థులకు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు.
-సమరసింహారెడ్డి, మల్లాకండ్రిగ, విజయపురం మండలం
తిరుపతే మాకు సౌకర్యం
నగరి నుంచి తిరుపతికి రైలు సౌకర్యంతో పాటు ప్రతి 15 నిమిషాలకో బస్సు ఉంది. రవాణా సౌకర్యంతో పాటు విద్య, వైద్య సౌకర్యాలు కూడా తిరుపతిలోనే బాగున్నాయి. ఈ మూడు మండలాల ప్రజలకు తిరుపతితోనే అనుబంధం ఉంది. చిత్తూరుకు వెళ్లాలంటేనే నానా అవస్థలు పడాలి.
-ఈఎన్ శ్రీనివాసులు, కేవీపీఆర్‌పేట, నగరి మండలం