ఏనుగుల కట్టడికి ఇదే సరైన సమయం
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:31 AM
పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల మంద ఐదు రోజుల క్రితం మండలాన్ని వీడాయి. తిరుపతి జిల్లా అడవుల వైపు వెళుతున్న ఏనుగుల మంద మళ్లీ మళ్లీ తిరిగి పులిచెర్ల మండలం వైపే చూస్తున్నాయి.
పులిచెర్ల మండలం నుంచి వెళ్లిన ఏనుగులు దేవరకొండ బీట్‌లో సంచారం
ఇరు జిల్లాల అటవీశాఖ అధికారులు సమన్వయంతో స్పందిస్తే పరిష్కారం
కల్లూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల మంద ఐదు రోజుల క్రితం మండలాన్ని వీడాయి. తిరుపతి జిల్లా అడవుల వైపు వెళుతున్న ఏనుగుల మంద మళ్లీ మళ్లీ తిరిగి పులిచెర్ల మండలం వైపే చూస్తున్నాయి. భాకరాపేట అడవి వైపు వెళుతున్న ఏనుగుల మంద తిరిగిరావని ప్రజలు ఆశించినా తిరుపతి జిల్లా అటవీశాఖ సిబ్బంది మళ్లించడంతో ఏనుగుల మంద మళ్లీ తిరిగి ఇటువైపే వస్తున్నాయి. దీనిపై చిత్తూరు, తిరుపతి జిల్లాల అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తలకోన అడవి వైపు ఏనుగులను మళ్లిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మూడేళ్లుగా పులిచెర్ల మండలంలో జరిగిన ఏనుగుల దాడుల్లో పంటలకు అపారనష్టం వాటిల్లింది.కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న 16 ఏనుగుల మంద మూడు రోజుల క్రితం గడ్డంవారిపల్లి పంచాయతీ సరిహద్దు నుంచి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోకి చేరుకున్నాయి. అక్కడ పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద ప్రస్తుతం భాకరాపేట రేంజ్ పరిధిలోని దేవరకొండ బీట్ తుమ్మలచేను దగ్గర తిష్ట వేశాయి. అక్కడున్న ఏనుగులను అటవీశాఖ సిబ్బంది ఇటువైపు మళ్లించకుండా తలకోన వైపు మళ్లిస్తే ఏనుగులు తిరిగి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తలకోన నుంచి కోడూరు వరకు ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగులకు అత్యంత ఇష్టమైన వెదురు పొదలు అధికంగా ఉన్నాయి. దీంతో ఏనుగుల మంద వెదుర్లను తింటూ అక్కడే శాశ్వతంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా కాకుండా ఏనుగుల మందను కళ్యాణి డ్యాం వైపు మళ్లిస్తే అటు నుంచి భీమవరం మార్గంలో తిరిగి పులిచెర్ల మండలంలోకి చేరుకుంటాయి. దీంతో ఈ మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదటికొస్తాయి.చిత్తూరు, తిరుపతి జిల్లాల అటవీశాఖ అధికారులు స్పందించి ఉమ్మడి ప్రణాళికలతో ఏనుగుల బెడద నుంచి పంటలను కాపాడాలని, ప్రజలను రక్షించాలని కోరుతున్నారు.
కుప్పం, పులిచెర్ల మండలాల్లో సోలార్ కంచె ఏర్పాటు!
చిత్తూరు సెంట్రల్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఏనుగుల తాకిడిని నివారించడానికి రెండు మండలాల్లో సోలార్ కంచె వేయడానికి అటవీశాఖ సిద్ధమైంది. కుప్పం, పులిచెర్ల మండలాల్లో హ్యాంగింగ్ సోలార్ కంచెను ఏర్పాటు చేయనున్నారు. కుప్పం అటవీ ప్రాంత పరిధిలో నాలుగు కిలో మీటర్లు, పులిచెర్ల మండలం అటవీ ప్రాంత పరిధిలో ఐదు కిలో మీటర్ల చొప్పున మొత్తం 9 కిలో మీటర్లు మేర హ్యాంగింగ్ సోలార్ కంచె ఏర్పాటుకు అవసరమైన టెండర్లను త్వరలో పిలవనున్నారు. ఇదిలా ఉండగా పెనుమూరు మండలం కలిగిరి కొండ కింద పర్యాటక కేంద్రం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ ద్వారా నగరవనం ఏర్పాటుకు రాష్ట్ర అటవీ శాఖ రూ.1.40 కోట్లు మంజూరు చేసింది. దీంతో పాటు కలెక్టరేట్ సమీపంలోని నగరవనంలో అభివృద్ధి పనుల నిమిత్తం మరో రూ.15 లక్షలు మంజూరయ్యాయి.ఈ నిధులను గార్డెనింగ్, పొగోడా (రౌండ్ షెడ్స్), సీసీ కెమెరాల ఏర్పాటుకు వాడుకోనున్నారు. వారం రోజుల్లో మంజూరైన పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.