అధికారులూ ఇదేమి తీరు!
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:21 AM
సూళ్లూరుపేట మండలం నెర్రికాలువ గండి పూడ్చివేత పనుల్లో ఇరిగేషన్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. లూథరిన్ చర్చి వైపు హడావిడిగా కాంక్రీట్ వాల్ నిర్మించిన అధికారులు.. నెర్రికాలువకు గండిపడిన చోట మాత్రం చెరువు మట్టిని తోలి చదును చేస్తున్నారు.
నెర్రికాలువ గండికి అటువైపు కాంక్రీట్ వాల్ నిర్మాణం
సూళ్లూరుపేట, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట మండలం నెర్రికాలువ గండి పూడ్చివేత పనుల్లో ఇరిగేషన్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. లూథరిన్ చర్చి వైపు హడావిడిగా కాంక్రీట్ వాల్ నిర్మించిన అధికారులు.. నెర్రికాలువకు గండిపడిన చోట మాత్రం చెరువు మట్టిని తోలి చదును చేస్తున్నారు. జీఎన్‌టీ రోడ్డులోని లూఽథరన్ చర్చి వెనుకాలే ఉన్న నెర్రికాలువకు గతేడాది డిసెంబరులో కురిసిన వర్షాలకు భారీగండి పడింది. జనవరిలో తాత్కాలిక మరమ్మతుల కింద ఇసుక బస్తాలు వేశారు. గండిపడిన చోట పూడ్చేందుకు శాశ్వత కాంక్రీట్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.39 లక్షలు కేటాయించింది. కాలువకు గండిపడిన ప్రాంతంలో కాకుండా చర్చి వెనుకవైపు ఉన్న కట్టను తవ్వి అధికారుల సమక్షంలో కాంక్రీట్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గండిపడిన చోట కూడా కాంక్రీట్ వాల్ నిర్మిస్తామని అధికారులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇదే మాట ఎమ్మెల్యే విజయశ్రీకి కూడా చెప్పారు. కానీ, చర్చివైపు కాంక్రీట్‌వాల్ నిర్మాణం పూర్తి చేశారు. తర్వాత సమీపంలోని వాటంబేడు చెరువు నుంచి మట్టి తోలి నెర్రికాలువ గండిని పూడ్చి కేవలం మట్టితోనే పొర్టుకట్టను చదునుచేస్తున్నారు. పక్కనే కాళంగి నది ఉండడంతో పొర్లుకట్ట ఏమాత్రం బలహీనమైన మళ్లీ గండిపడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు ఇదేమని ప్రశ్నిస్తే సమయం లేదు ప్రస్తుతం తాత్కాలికంగా గండిని పూడ్చి పొర్లుకట్టకు మట్టితో చదును చేసి సాగునీళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తప్పించుకున్నారు. నెర్రికాలువ గండిపూడ్చేందుకు మంజూరైన నిధులను ఇలా బూడిదలోపోసిన పన్నీరుగా అధికారులు దుర్వినియోగం చేశారని రైతులు ఆగ్రహిస్తున్నారు. అసలు పొర్లుకట్టకు రైతుల సాగునీటికి ఉపయోగపడే చెరువుల నుంచి మట్టిని తరలించకూడదు. కానీ చెరువు మట్టిని ఎక్స్‌కవేటర్లతో తవ్వి లారీలకు నింపి నిత్యం తరలిస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల హస్తం కూడా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా అధికారులు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.