మూడో విడత రీ సర్వే ప్రారంభం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:40 AM
చిత్తూరు జిల్లాలో మూడో విడత భూముల రీ సర్వే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లో 12 గ్రామాలను సర్వే చేసేందుకు ఎంపిక చేశారు.మొత్తం 3859 ఎకరాల్లో సర్వే చేపట్టనున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి):జిల్లాలో మూడో విడత భూముల రీ సర్వే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లో 12 గ్రామాలను సర్వే చేసేందుకు ఎంపిక చేశారు.మొత్తం 3859 ఎకరాల్లో సర్వే చేపట్టనున్నారు. 2026 మార్చి 31వ తేదీకి రీ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు.చిత్తూరు రెవెన్యూ డివిజన్లో ఎస్‌ఆర్‌పురం మండలంలోని రిపుంజరాజపురం, గుడిపాల మండలంలో రాగిమానుపట్టెడ, తవణంపల్లె మండలంలో గోవిందరెడ్డిపల్లె, జీడీ నెల్లూరు మండలంలో ఆత్మకూరు,పలమనేరు రెవెన్యూ డివిజన్లో వి.కోట మండలంలోని పైపల్లె, పెద్ద పంజాణి మండలంలో ముట్టుకూరు, బంగారుపాళ్యం మండలంలో మోతగుంట, కుప్పం డివిజన్‌లో శాంతిపురం మండలంలోని చిల్లిమానుపల్లె, గుడుపల్లె మండలంలోని ఓఎన్ కొత్తూరు, నగరి డివిజన్‌లో కార్వేటినగరం మండలంలోని ఈదులవారిపల్లె, నిండ్ర మండలంలో కూనమరాజుపాళెం, నగరి మండలంలో శ్రీనివాసపురం గ్రామాలను ఎంపిక చేశారు. తొలి విడతలో జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాల్లో 30,774, రెండో విడతలో 38 గ్రామాలలో 40,359 ఎకరాల్లో భూమిని సర్వే చేశారు.రీ సర్వేకు గ్రామ, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలను బృందాలుగా నియమించారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆర్‌ఐలు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీవోలకు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే భూముల కొలతలు, రెవెన్యూ రికార్డుల అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సిబ్బందికి శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. ఎప్పుడెప్పుడు ఏయే పనులు ఎలా చేయాలనే విషయంపై ప్రణాళికలు పంపించారు. అందుకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్, భూ రికార్డుల్లో సవరణలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను రీ సర్వేలో గుర్తించాలని, వాటలో సివిల్ కేసులుంటే కోర్టులను ఆశ్రయించేలా అర్జీదారులకు వివరించాలన్నారు.