Share News

అంధుడినని విధుల్లోకి చేర్చుకోకుండా అవమానించారు!

ABN , Publish Date - Jun 27 , 2025 | 01:20 AM

అంధుడినని తనను విధుల్లోకి చేర్చుకోకుండా బీఎన్‌ కండ్రిగ తహసీల్దారు అవమానించారని, కనీసం తనను ఛాంబరులోకి కూడా అనుమతించలేదంటూ డీటీ బి.నాగరాజు వాపోయారు. అంధుడినైనా రెవెన్యూ శాఖలో వివిధ పోస్టుల్లో పనిచేసిన తాను ఇలా ఏనాడూ వివక్షను, అవమానాన్ని ఎదుక్కోలేదంటూ కంటతడి పెట్టారు.

అంధుడినని విధుల్లోకి చేర్చుకోకుండా అవమానించారు!
టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డితో మాట్లాడుడున్న డీటీ నాగరాజు

తిరుపతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): అంధుడినని తనను విధుల్లోకి చేర్చుకోకుండా బీఎన్‌ కండ్రిగ తహసీల్దారు అవమానించారని, కనీసం తనను ఛాంబరులోకి కూడా అనుమతించలేదంటూ డీటీ బి.నాగరాజు వాపోయారు. అంధుడినైనా రెవెన్యూ శాఖలో వివిధ పోస్టుల్లో పనిచేసిన తాను ఇలా ఏనాడూ వివక్షను, అవమానాన్ని ఎదుక్కోలేదంటూ కంటతడి పెట్టారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డిని కలిసి తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించారు. పుట్టుకతో అంధుడినైన తనకు రెవెన్యూ శాఖలో ఉద్యోగం రావడంతో శక్తిమేరకు విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. డీటీగా తొట్టంబేడు మండలంలో పనిచేసిన తనకు తాజా బదిలీల్లో బీఎన్‌ కండ్రిగకు బదిలీ అయిందన్నారు. గత సోమవారం విధుల్లో చేరేందుకు బీఎన్‌ కండ్రిగ వెళ్ళగా తహసిల్దారు కార్యాలయ గదిలోకి కూడా అనుమతించలేదని, విధుల్లోకి చేర్చుకునేది లేదని చెప్పి పంపించేశారన్నారు. అంధుడినని, విధులకు సంబంధించిన పనులు చేయలేనన్న ఉద్దేశంతోనే అవమానించారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ దృష్టికి భానుప్రకా్‌షరెడ్డి తీసుకెళ్లారు. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అవమానించలేదు.. ఆలస్యం జరిగిందంతే

ఈ విషయమై బీఎన్‌ కండ్రిగ తహసీల్దారు శ్రీదేవిని వివరణ కోరగా.. తాను డిప్యూటీ తహసిల్దారు నాగరాజును అవమానించలేదని, విధుల్లోకి చేర్చుకోవడంలో ఆలస్యం జరిగిందని సమాధానమిచ్చారు. గత సోమవారం విధుల్లోకి చేరేందుకు ఆయన తమ కార్యాలయానికి రాగా ఛాంబరులోకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడానని చెప్పారు. అంధుడైనందున ప్రజల అర్జీలు చదవలేరని, పనులు ఆలస్యమవుతాయని కొందరు అధికార పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. దీనిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరొకరిని డీటీగా కేటాయించాలని కోరే ప్రయత్నంలో డీటీ నాగరాజు విధుల్లోకి చేరడం ఆలస్యమైందన్నారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఫోన్‌ చేసి డీటీ నాగరాజును విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఆ మేరకు డ్యూటీలో జాయిన్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవమానించారన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 01:20 AM