ఓట్‌చోర్‌పై బహిరంగ చర్చకు రావాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:18 AM
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో వైసీపీ నేతలే ఓటు చోరులని, ఈ విషయంలో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్ విసిరారు.
కూటమి నేతల సవాల్
తిరుపతి(ఉపాఽధ్యాయనగర్), డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో వైసీపీ నేతలే ఓటు చోరులని, ఈ విషయంలో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్ విసిరారు. ఆదివారం తిరుపతిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతోపాటు టీడీపీ, జనసేన జిల్లా అధ్యక్షులు నరసింహయాదవ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని మోదీని ఓట్ చోర్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, సోనియా, ఇప్పటి రాహుల్ గాంధీ వరకు ఓట్ చోరీ రాజకీయాలే చేశారని, చేస్తున్నారని విమర్శించారు. విదేశీయులను తీసుకువచ్చి ఓటర్లుగా చేర్చి గెలుస్తూ వచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఓట్ చోర్ రాజకీయాలు చేసిందన్నారు. జిల్లాలో 40 వేలమంది దొంగ ఓటర్లను చేర్పించి గత ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపఖ్యాతిపాలు చేస్తున్నాయన్నారు. వలసదారులు దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రుల ఎన్నికను ప్రభావితం స్థాయిలో ఉన్నారన్నారు. సోనియా దేశ పౌరసత్వం లేకుండానే ఓట్ వేయలేదా అని నిలదీశారు. నరసింహయాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా రాజకీయాలు చేసిందని, తీరు మార్చుకోకపోతే రాష్ట్రంలో వైసీపీకి పట్టినగతే పడుతుందన్నారు. డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్ మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక ఓట్ చోరీ అంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మఽధుసూదన్, ప్యానలిస్ట్ గాలి పుష్పలత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరే్‌షబాబు, ఉపాధ్యక్షులు అనూషా రామకృష్ణ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.