Share News

ప్రవేశాలకు ‘ఆధారం’ లేదు

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:15 AM

జిల్లాలో 1, 2 తరగతులకు సంబంధించి 500 మందికి పైగా విద్యార్థులకు ఇప్పటికీ ఆధార్‌ కార్డులు లేనట్టు విద్యాశాఖాధికారులు గుర్తించారు. 1, 2 తరగతుల్లో ప్రవేశాలకు వస్తున్నవారిలో అత్యధిక శాతం మందికి ఆధార్‌ లేకపోవడంతో ప్రవేశాల లెక్కలు నమోదు కావడంలేదు.

ప్రవేశాలకు ‘ఆధారం’ లేదు

ఆధార్‌ లేని విద్యార్థులు 500కి పైగానే

జిల్లా వ్యాప్తంగా 7 పాఠశాలల్లో కేంద్రాలు

తిరుపతి(విద్య), జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1, 2 తరగతులకు సంబంధించి 500 మందికి పైగా విద్యార్థులకు ఇప్పటికీ ఆధార్‌ కార్డులు లేనట్టు విద్యాశాఖాధికారులు గుర్తించారు. 1, 2 తరగతుల్లో ప్రవేశాలకు వస్తున్నవారిలో అత్యధిక శాతం మందికి ఆధార్‌ లేకపోవడంతో ప్రవేశాల లెక్కలు నమోదు కావడంలేదు. ఆయా విద్యార్థులను ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా చేర్చలేక పోతున్నారు. ముఖ్యంగా యుడైస్‌ నమోదు కావడంలేదు. దీంతో ఇప్పటి వరకు 1, 2 తరగతుల్లో ఎంత మంది చేరారనే లెక్కలు తేలడం లేదు. ఈ క్రమంలో ఏడు పాఠశాలల్లో ఆధార్‌ నమోదు కేంద్రాల ఏర్పాటుకు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ చర్యలు తీసుకున్నారు. తిరుచానూరు జడ్పీ హైస్కూల్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీజేఎన్‌ఎం మున్సిపల్‌ హైస్కూల్‌, శ్రీకాళహస్తి మండలం ఊరందూరు జడ్పీ హైస్కూల్‌, పుత్తూరు బాలికల జడ్పీ హైస్కూల్‌లో, గూడూరులోని జడ్పీ బాలికల, బాలుర పాఠశాలలు, నాయుడుపేటలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే ఈ ఆధార్‌ కేంద్రాలు పనిచేస్తాయని డీఈవో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కేంద్రాల్లో ఆధార్‌ నమోదు చేయించి ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలని సూచించారు. డీవైఈవోలు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలో ఆధార్‌ లేని విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి నమోదు చేయించాలన్నారు. ఆ వెంటనే యుడై్‌సలో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని సూచించారు.

Updated Date - Jul 02 , 2025 | 02:15 AM