ధరలున్నా.. తెగుళ్ల శాపం..!
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:59 AM
ఏడాది పొడవునా సాగు చేసే టమోటా రైతుల్లో ఆందోళన నెలకొంది. సీజన్‌తో సంబంధం లేకుండా రైతులు టమోటా సాగుపై మొగ్గు చూపుతున్నారు.
‘ఊజీ’తో టమోటాకు నల్లటి మచ్చలు
సోమల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఏడాది పొడవునా సాగు చేసే టమోటా రైతుల్లో ఆందోళన నెలకొంది. సీజన్‌తో సంబంధం లేకుండా రైతులు టమోటా సాగుపై మొగ్గు చూపుతున్నారు. సోమల మండలంలో విస్తారంగా టమోటా సాగు చేపట్టారు. గత సీజన్‌లో రికార్డుస్థాయిలో ధరలు పలికిన టమోటా సాగుపై మక్కువ పెంచుకున్న రైతన్నలు సోమల, నంజంపేట, కందూరు, నెల్లిమంద, నడింపల్లె, ఇరికిపెంట, అన్నెమ్మగారిపల్లె తదితర పంచాయతీల్లో సుమారు 3,600 ఎకరాల్లో గత డిసెంబరు నుంచి విడతల వారీగా సాగు చేపట్టారు. 15 కిలోల బాక్సు జూన్ నెల వరకు రూ.30 నుంచి రూ. 60 మాత్రమే పలికి రైతులు నష్టాలపాలయ్యారు. కొందరు రైతులు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాక చేతి నుంచి చెల్లించారు. మరికొందరు తోటల్లోనే కాయలను పశువులకు మేతగా వదిలేశారు. ఫిబ్రవరి, మార్చి వరకు నాట్లు వేసిన తోటల్లో దిగుబడులు వచ్చిన రైతులు ఎకరా సాగుకు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి నష్టపోయారు. ఏప్రిల్ నెలలో నాట్లు వేసిన తోటల్లో జూలై నెలలో దిగుబడులు వచ్చిన రైతులకు మాత్రమే 15 కిలోల బాక్సు రూ.100 నుంచి రూ.300 చేరుకోవడంతో పెట్టుబడులు మాత్రమే చేతికి అందాయి. ఈ సమయంలోనే వాతావరణం అనుకూలించక తోటల్లో పలు రకాల చీడపీడలు ఆశించడంతో వారంలో రెండు సార్లు మందులను పిచికారీ చేస్తూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 100 బాక్సుల్లో 50 బాక్సులు ఊజీ ఈగల దాడులతో దెబ్బతిన్న కాయలు, నల్లమచ్చ కాయలు ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండల తీవ్రతతో మొక్కలు ఎదుగుదల లేక పలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు సార్లు కోతలు కోస్తే దిగుబడులు తగ్గిపోతున్నాయి.ఈ పరిస్థితిలో నష్టాలే మిగులుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. టమోటాకు నల్లమచ్చలు, ఆకుముడత, తెల్లదోమ, పచ్చదోమలు వ్యాప్తి అధికంగా ఉండి మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడం, ధరలు ఉండి టమోటాలో నాణ్యత లేకపోవడంతో నష్టాలు చవిచూస్తున్నారు. టమోటా సాగుకు బిందుసేద్యం, కట్టెలు నాటడం, దారం వంటి ఖర్చులు పెరగడం, వాతావరణం అనుకూలించక వైరస్ ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టమోటా తోటల్లో ఊజీ ఈగలు బెడదతో కోతలు చేయకుండానే తోటల్లోనే పండ్లను వదిలేస్తున్నారు.ధరలు కొంత ఊరటగా ఉన్నా ఊజీ ఈగలు, నల్లమచ్చ తెగుళ్లతో నష్టపోతున్నారు.