Share News

డ్రోన్లున్నాయ్‌.. జాగ్రత్త

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:24 AM

దీపావళి నేపథ్యంలో కోడి పందేలు, జూద స్థావరాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ప్రధానంగా కోడి పందేల నిర్వాహకులపై దృష్టి సారించిన పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించి జూదరుల ఆట కట్టించారు.

డ్రోన్లున్నాయ్‌.. జాగ్రత్త
ఏర్పేడు మండల పరిధిలో ఇటీవల డ్రోన్‌ పట్టించిన పేకాట డెన్‌

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దీపావళి నేపథ్యంలో కోడి పందేలు, జూద స్థావరాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ప్రధానంగా కోడి పందేల నిర్వాహకులపై దృష్టి సారించిన పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించి జూదరుల ఆట కట్టించారు. ముఖ్యంగా ఎర్రావారిపాలెం, భాకరాపేట, శ్రీకాళహస్తి, నెరబైలు, తొట్టంబేడు, సత్యవేడు తదితర ప్రాంతాల్లో నిఘా పెంచి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇలా గుర్తించిన స్థావరాలపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు. వారం కిందట తిరుపతి నగరం యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జడ్పీ పాఠశాల వెనుక బహిరంగ ప్రదేశంలో జూదం ఆడుతున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడికి సమాచారం అందింది. దీంతో సైబర్‌ క్రైం సీఐ వినోద్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. డీఎస్పీ భక్తవత్సలం, సీఐ రామయ్య, సిబ్బంది కలసి డ్రోన్లు పంపి ఆ ప్రాంతంలో నిఘా వుంచారు. అక్కడ జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇలా జూద గృహాలు, కోడి పందేలను డ్రోన్ల ద్వారా గుర్తించి.. నిందితులను అరెస్టు చేశారు. సమాచారం వచ్చిన వెంటనే డ్రోన్లను పంపడం ద్వారా శిబిరాల నిర్వాహకులను గుర్తించి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీపావళితో పాటు అంతకు ముందు.. తర్వాత కోడి పందేలు, జూదాలు సాగకుండా కట్టడి చేయడానికి సైబర్‌ క్రైం పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిరంతర తనిఖీలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో నమోదైన కేసులు, స్థావరాలను పరిశీలించి వాటిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:24 AM