Share News

మీపై సీబీఐ కేసులున్నాయ్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:13 AM

మీపై సీబీఐ కేసులున్నాయంటూ తిరుపతిలోని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడికి సైబర్‌ నేరగాళ్లు ఫోనుచేసి బెదిరించారు

మీపై సీబీఐ కేసులున్నాయ్‌

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): మీపై సీబీఐ కేసులున్నాయంటూ తిరుపతిలోని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడికి సైబర్‌ నేరగాళ్లు ఫోనుచేసి బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన ప్రకారం.. తిరుపతిలో నివసించే ఒక రిటైర్డు టీచర్‌కు ఈ నెల 6న గుర్తు తెలియని నెంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నేను సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా. మీ ఫోన్‌ నెంబరు నుంచి మహిళలకు అనుచిత మెసేజ్‌లు పంపిన కేసులో విచారణకు మీరు బెంగళూరుకు రావాలి’ అని బెదిరించారు. ఆ తర్వాత మరో నెంబరు నుంచి కాల్‌ చేసి తాము ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ‘ఇప్పుడు పోలీసులకు కాల్‌ కనెక్టు చేస్తున్నాం. మీపై సీబీఐ కేసులున్నాయి. మీరు ఆధార్‌ కార్డు అమ్మడంతో.. మీ పేరిట బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేశారు. రూ.మూడు కోట్లకపైగా లావాదేవీలు జరిగాయి. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై పోలీసు అరెస్టు ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. గదిలోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసి మాట్లాడు. మీ వద్ద ఎంత డబ్బుందో చెప్పండి’ అంటూ రిటైర్డు టీచర్‌ను మానసికంగా కుంగదీశారు. ఈ కేసుల్లో నిర్దోషిగా బయట పడాలంటే తక్షణం రూ.8 లక్షలు డిపాజిట్‌ చేయాలన్నారు. ఎక్కడో అనుమానం వచ్చిన ఆ రిటైర్డు టీచరు సోమవారం తిరుపతి సైబర్‌ క్రైం ఆఫీసులో ఫిర్యాదు చేశారు. అవి నకిలీ సైబర్‌ కాల్స్‌ అని, భయపడాల్సిన అవసరం లేదని సీఐ వినోద్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. ఇలాంటి వాటిపై వెంటనే 112కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:13 AM