రబీకి సరిపడే యూరియా నిల్వలున్నాయ్
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:23 AM
యూరియా ఎరువులు సమృద్ధిగా లభ్యమవుతున్నాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు.
కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): యూరియా ఎరువులు సమృద్ధిగా లభ్యమవుతున్నాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ పంట కాలానికి అవసరమైన 20,183 టన్నుల యూరియాఎరువుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత మూడునెలల కాలంలో 5,747 టన్నుల అవసరం కాగా ఇప్పటికే రైతులకు 6,753 టన్నులు యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. మరో 500 టన్నులు రానుందని చెప్పారు. ప్రస్తుతం 1,558 టన్నుల యూరియాను రైతుల అవసరాల కోసం మార్క్‌ఫెడ్, ఆర్‌ఎ్‌సకే, సింగిల్‌విండోల గోదాముల్లో నిల్వ ఉంచి అమ్మకాలు చేయాలని ఆదేశించారు. బస్తాపై ముద్రించిన ఎంఆర్‌పీ ధరలకే వ్యాపారుస్థులు అమ్మకం చేయాలని, రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించే డీలర్లపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూరియా బస్తాలను ప్రభుత్వంతో చర్చించి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.