వి.కోటకు చేరుకున్న నీళ్లు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:48 AM
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గం వి.కోటకు శనివారం హంద్రీ-నీవా జలాలు చేరుకున్నాయి. ఉదయాన్నే బైరెడ్డిపల్లె మండలం నుండి కృష్ణాజలాలు తోటకనుమ మీదుగా గ్రావిటీ ద్వారా నీరు దానమయ్యగారిపల్లె వద్దకు చేరుకున్నాయి.
- అడుగడుగునా గంగమ్మకు జల హారతులు
వి.కోట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గం వి.కోటకు శనివారం హంద్రీ-నీవా జలాలు చేరుకున్నాయి. ఉదయాన్నే బైరెడ్డిపల్లె మండలం నుండి కృష్ణాజలాలు తోటకనుమ మీదుగా గ్రావిటీ ద్వారా నీరు దానమయ్యగారిపల్లె వద్దకు చేరుకున్నాయి. మధ్యాహ్నం కృష్ణాపురం వద్దనున్న పంప్ హౌస్‌కు జలాలు రావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం పంప్ హౌస్‌లో మిషన్లకు హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారులు, టీడీపీ నేతలు, కూటమి నాయకులు పూజలు చేశారు. పంప్‌హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసి నీరు పంపింగ్ చేశారు. కాసేపటికే నీరు రెండు పైపుల నుంచి బయటకు రావడంతో ఒక్కసారిగా రైతులు, పార్టీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో 600 కిలోమీటర్లు మేర కాల్వ పూర్తి చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 700 అడుగుల ఎత్తుకు నీటిని తరలించడం చారిత్రాత్మకం అన్నారు. సాయంత్రానికి వి.కోట - కుప్పం మార్గంలోని దాసార్లపల్లె వద్ద జాతీయ రహదారిని దాటి కృష్ణా జలాలు కుప్పం వైపు పరవళ్లు తొక్కాయి. రాత్రికి పెద్దబరిణేపల్లె పంచాయతీ ఆదినేపల్లె వద్దనున్న మరో పంప్ హౌస్‌కు నీరు చేరుకోనున్నాయి. అక్కడ నీటిని పంప్ చేస్తే కుప్పం సెగ్మెంట్ పరిధిలోని రామకుప్పం మండలంలోకి అడుగెడుతాయి. ఇందుకుగాను హెచ్‌ఎన్ ఎస్‌ఎస్ అధికార బృందం కాల్వ వెంబడి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
30న సీఎం చంద్రబాబు జలహారతి
కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువుకు ఆదివారం రాత్రికి కృష్ణా జలాలు చేరవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 30న ఈ చెరువు వద్ద హంద్రీ-నీవా కాలువకు జలహారతి ఇవ్వనున్నారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీ-నీవా కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. శనివారం నాటికి వి.కోట మండల పరిధిలోకి వచ్చేశాయి. ప్రస్తుతం కాల్వలో 80 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇదే వేగంతో సాగితే ఆదివారం రాత్రికల్లా కుప్పం మండలంలోకి వస్తాయి.