Share News

గ్రామకంఠాల లెక్కలు తేలాయ్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:42 AM

దశాబ్దాలుగా భూమి అనుభవంలో ఉన్నా యాజమాన్య హక్కులు పొందలేని గ్రామీణులకు ఊరట లభించనుంది. లెక్కలు తేల్చి ఇలాంటి వారికి ప్రభుత్వం సర్వ హక్కులూ కల్పించాలని సంకల్పించింది.

గ్రామకంఠాల లెక్కలు తేలాయ్‌

390 రెవెన్యూ గ్రామాల్లో మ్యాపింగ్‌ పూర్తి

ఆధునిక డ్రోన్లతో జల్లెడ పట్టి మరీ సర్వే

37లక్షల యాజమాన్య కార్డుల అందజేతకు అడుగులు

తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా భూమి అనుభవంలో ఉన్నా యాజమాన్య హక్కులు పొందలేని గ్రామీణులకు ఊరట లభించనుంది. లెక్కలు తేల్చి ఇలాంటి వారికి ప్రభుత్వం సర్వ హక్కులూ కల్పించాలని సంకల్పించింది. హక్కు పత్రాలను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. అస్తవ్యస్తంగా ఉన్న భూ వివరాలను గాడిన పెట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం వినియోగించుకుంటోంది.

వివాదాలకు చెక్‌

చాలా పల్లెల్లో గ్రామకంఠాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. కొందరు చాన్నాళ్లుగా ఎలాంటి లెక్కలూ లేని ఖాళీ స్థలాలను అనుభవిస్తున్నారు. దశాబ్దాలుగా భూములు అనుభవంలో ఉన్నా చట్టపరంగా హక్కులూ లేవు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకూ అవకాశం లేదు. దీంతో వీరంతా బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఈ పథకం అమలుకు నడుం బిగించింది. గ్రామకంఠాలు, ఖాళీ స్థలాలపై చట్టబద్ధత కల్పించి యాజమాన్య హక్కులు కల్పించేందుకు పక్కాగా అడుగులు వేస్తోంది.

తొలి విడత సర్వే పూర్తి

జిల్లాలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీపీవో సుశీలదేవి స్వామిత్వపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. మొదటి విడత కింద 390 రెవెన్యూ గ్రామాల్లో ఆధునిక డ్రోన్‌ టెక్నాలజీ వినియోగించి అధికారులు సర్వే చేశారు. భవనాలు, చెరువులు, రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులుంటే గుర్తించి పంచాయతీలకు అప్పజెబుతున్నారు. దీంతో వివాద భూములన్నింటిపైనా పూర్తి స్పష్టత వస్తోంది. లెక్కలు తేల్చిన భూములపై వచ్చే ఏడాది మార్చి నాటికి 1.37లక్షల ప్రాపర్టీ కార్డులను యజమానులకు అందజేయనున్నారు. సాగు భూములపట్టాదారు పాసుపుస్తకాల తరహాలో గ్రామ కంఠ భూములకూ ప్రాపర్టీ కార్డులుంటాయి. వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం చట్టసవరణ చేస్తోంది. రెండవ విడతగా జిల్లాలో 368 గ్రామ పంచాయతీల్లో డ్రోన్‌ సర్వే నిర్వహంచనుంది. తద్వారా మిగిలిన గ్రామ కంఠాల అనుభవదారులకు కూడా ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉంది.

గ్రామీణులకు ఊరట

ఆబడి, అనాదీనం(గ్రామకంఠం)లో ఉంటున్న వారికి స్వామిత్వ ద్వారా చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. గ్రామ కంఠాల వివాదాలకు చెక్‌ పెడుతూ యజమానికి ప్రాపర్టీకార్డులు అందజేస్తాం. రిజిస్ట్రేషన్‌, క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాల మేరకు 390 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయింది. 1.37 లక్షల కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. రెండో విడత సర్వే ప్రక్రియ కూడా ప్రారంభించాం.

- సుశీలాదేవి, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - Dec 15 , 2025 | 01:42 AM