Share News

విడవని జడివాన

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:21 AM

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా జిల్లావ్యాప్తంగా విడవకుండా వర్షాలు కురుస్తున్నాయి.సెప్టెంబరు నెల సగటు వర్షపాతం 157 మిమీ కాగా శుక్రవారం నాటికే సగటుకు మించి 159.5 మిమీ వర్షపాతం నమోదయ్యింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బైరెడ్డిపల్లెలో 92.4, అత్యల్పంగా రొంపిచెర్లలో 3 మిమీ వర్షం కురిసింది.

 విడవని జడివాన
యాదమరి మండలం భూమిరెడ్డిపల్లి వద్ద మొరవ పారుతున్న నుంజర్ల ప్రాజెక్టు

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా జిల్లావ్యాప్తంగా విడవకుండా వర్షాలు కురుస్తున్నాయి.సెప్టెంబరు నెల సగటు వర్షపాతం 157 మిమీ కాగా శుక్రవారం నాటికే సగటుకు మించి 159.5 మిమీ వర్షపాతం నమోదయ్యింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బైరెడ్డిపల్లెలో 92.4, అత్యల్పంగా రొంపిచెర్లలో 3 మిమీ వర్షం కురిసింది. మండలాలవారీగా వి.కోటలో 90.6, రామకుప్పంలో 88, గుడిపాలలో 80.4, యాదమరిలో 68.4, గంగవరంలో 57.8, బంగారుపాళ్యంలో 52, చిత్తూరు అర్బన్‌లో 51.4, పలమనేరులో 48.2, చిత్తూరు రూరల్‌లో 45.6, నగరిలో 45.6, పెద్దపంజాణిలో 43.2, గంగాధరనెల్లూరులో 37, కార్వేటినగరంలో 36.8, కుప్పంలో 36, శాంతిపురంలో 35.8, తవణంపల్లెలో 34.2, సదుంలో 28.2, సోమలలో 26.8, పుంగనూరులో 24.6, గుడుపల్లిలో 20.4, చౌడేపల్లెలో 20, పాలసముద్రంలో 19.4, శ్రీరంగరాజపురంలో 19.2, విజయపురంలో 16.2, ఐరాలలో 15, పూతలపట్టులో 9.2, వెదురుకుప్పంలో 6.4, నిండ్రలో 6.2, పెనుమూరులో 5.6 మిమీ వర్షపాతం నమోదైంది.

చెలిమిచేను పరవళ్లు

రామకుప్పం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.అటవీప్రాంతంలోని వాగులు, వంకలు, చెక్‌డ్యాంల నుంచి వస్తున్న వర్షపునీటితో వీర్నమల సమీపంలోని చెలిమిచేను జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. జలపాతం పైబాగంలో బండరాళ్ళ మీదుగా ఉధ్రుతంగా జలాలు ప్రవహిస్తున్నాయి.సుమారు 200అడుగుల కిందకు జాలువారుతున్నాయి.

హంద్రీ-నీవా కాలువకు గండి

వి.కోట, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వి.కోట మండల పరిధిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హంద్రీ-నీవా కాలువకు వెంకటేపల్లె వద్ద గండి పడింది. యర్రంపల్లెకు ఎగువనున్న కాలువ గట్టు పక్కన రెండు విద్యుత్‌ స్తంభాలు గాలుల తీవ్రతకు నేలకొరిగాయి. దీంతో కొడగల్లు వద్ద హంద్రీ-నీవా కాలువపై ఉన్న పంప్‌ హౌస్‌కు విద్యుత్‌ సరఫరా ఆగింది.మోటార్లు పనిచేయక పోవడంతో హంద్రీ నీవా కాలువలో నీటి ప్రహం పెరిగి వెంకటేపల్లె వద్ద కాలువ కుడి వైపు గండి పడింది. నిల్వ ఉన్న నీటికి పైభాగంలో వర్షపు నీరు దిగువకు తరలిరావడంతో కాలువ గట్టు తెగి భారీ ఎత్తున నీరు దిగువనున్న పొలాల్లోకి ప్రహించాయి.చిన్నశ్యామ చెరువు పూర్తిగా నిండి నాగిరెడ్డిపల్లె చెరువుకు మొరవ ప్రవహిస్తోంది. మార్గమధ్యంలోని సుమారు వంద ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. హంద్రీ-నీవా కాలువలో దిగువనున్న ప్రాంతాలకు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది.ట్రాన్స్‌కో ఏఈ రామకృష్ణ సిబ్బందితో కలిసి విద్యుత్‌ స్తంభాలను మార్చి మధ్యాహ్నానికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. అలాగే మోట్లపల్లె లిప్ట్‌ యూనిట్‌కు సరఫరా పునరుద్ధరించి మోటార్లు ఆన్‌ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం హంద్రీనీవా కాలువలో నీరు తిరిగి ప్రవహించడం మొదలైంది.

నిండుకుండలా కృష్ణాపురం జలాశయం

వెదురుకుప్పం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం రిజర్వాయర్‌ వర్షపు వరద నీటితో నిండుకుండలా మారింది. కృష్ణాపురం ప్రాజెక్టు నీటిమట్టం 213.00మీటర్లు కాగా ప్రస్తుతం 210మీటర్ల ఎత్తుకు నీరు చేరింది.శనివారం సాయంత్రం లేదా ఆదివారం గేట్లను ఎత్తి కృష్ణాపురం జలాశయం నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం వుందని ఇరిగేషన్‌ ఏఈఈ పీఎస్‌ భాస్కర్‌రాజీవ్‌ శుక్రవారం రాత్రి తెలిపారు.

Updated Date - Sep 20 , 2025 | 01:21 AM