Share News

ఇన్‌స్టాగ్రాం ‘బంధం’ విషాదాంతం

ABN , Publish Date - May 25 , 2025 | 01:00 AM

ఇన్‌స్టాగ్రాం పరిచయంతో చేరువైన వివాహిత, యువకుడి జీవితాలు విషాదాంతమయ్యాయి.విశాఖపట్నంలోని ముస్లింతాటిచెట్లపాళెం వీధికి చెందిన వెంకటలక్ష్మి అలియాస్‌ పద్మ(40)కు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇన్‌స్టాగ్రాం ‘బంధం’ విషాదాంతం

శ్రీకాళహస్తి యువకుడి చెంతకు విశాఖ వివాహిత

భర్త, పిల్లలను వీడి ప్రియుడితో వివాహం

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

విషం తాగి యువకుడు కూడా..

శ్రీకాళహస్తి, మే 24(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రాం పరిచయంతో చేరువైన వివాహిత, యువకుడి జీవితాలు విషాదాంతమయ్యాయి.విశాఖపట్నంలోని ముస్లింతాటిచెట్లపాళెం వీధికి చెందిన వెంకటలక్ష్మి అలియాస్‌ పద్మ(40)కు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మెడికల్‌ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, కుమార్తె డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిని. ఎక్కువగా ఇన్‌స్టాగ్రాం రీల్స్‌ చూస్తుండే పద్మకు ఏడాదిన్నర క్రితం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కైలాసగిరికాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ సురేశ్‌(25)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఏడాది క్రితం పద్మ భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడి కోసం శ్రీకాళహస్తికి వచ్చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించిన విశాఖపోలీసులు ఆమెను తిరిగి కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, సురేశ్‌తోనే జీవితం కొనసాగించాలని ఉందంటూ లేఖ రాసి గతేడాది నవంబరులో ఆమె మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేశారు. కుటుంబసభ్యులు బతిమలాడినా రానని తెగేసి చెప్పిన ఆమె సురేశ్‌ను వివాహం చేసుకున్నారు. సురేశ్‌ తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో వారికి దూరంగా కైలాసగిరిలో పద్మతో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే, ఏం జరిగిందో గానీ మూడు రోజుల క్రితం పద్మ మృతి చెందారు. దీంతో సురేశ్‌ కూడా గడియ పెట్టుకుని ఆ గదిలోనే ఉండిపోయాడు. శనివారం బయటకు వచ్చిన సురేశ్‌ పక్కవీధిలో ఉన్న తల్లి వద్దకు వెళ్లి పద్మ మరణవార్త తెలిపారు. టిపిన్‌, భోజనాన్ని వృథా చేస్తోందని మందలించడంతో మూడురోజుల క్రితం పద్మ ఉరి వేసుకుందని, శవాన్ని కిందకు దించి, భయంతో విషం తాగానని సురేశ్‌ తెలిపారు. మూడురోజుల తరువాత మెలకువ రావడంతో బయటికి వచ్చానన్నారు. సురేశ్‌ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విషం తాగిన సురే శ్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు.

Updated Date - May 25 , 2025 | 01:00 AM