కొలువుదీరిన ముక్కంటి ధర్మకర్తలమండలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:12 AM
శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తలమండలి ఆదివారం కొలువుదీరింది. ఎమ్మెల్యే సుధీర్, ముక్కంటి ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో అంజిఅంజి వినాయకస్వామి సన్నిధిలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్లను మండలి సభ్యులు దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తలమండలి ఆదివారం కొలువుదీరింది. ఎమ్మెల్యే సుధీర్, ముక్కంటి ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో అంజిఅంజి వినాయకస్వామి సన్నిధిలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్లను మండలి సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. పరిపాలన భవనంలోని మండలి చాంబర్‌కు చేరుకుని లాంఛనంగా ఆశీనులయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు తదితరులు అభినందనలు తెలిపారు. టీడీపీ నాయకులు మునిరాజానాయుడు, కంఠా రమేష్, గుర్రప్పశెట్టి, దుర్గాప్రసాద్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలికి మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ సమన్వయంతో పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ముక్కంటి ఆలయ చైర్మన్ స్థానం లభించిందని మంత్రి అన్నారు. కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు గైర్హాజరైతే.. శ్రీకాళహస్తిలో మాత్రం ఎమ్మెల్యే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పాల్గొనడం సంతోషకరమన్నారు. ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన నేత కిరణ్‌రాయల్ పాల్గొన్నారు.
భక్తులకు తీవ్ర ఇక్కట్లు
ఆదివారం రద్దీ ఎక్కువ. అదే సమయంలో అధిక సంఖ్యలో భక్తులు బారులుతీరే రూ.500 రాహుకేతు మండపం ఎదురుగా ఉన్న అంజి అంజి వినాయకస్వామి సన్నిధిలో కార్యక్రమం జరిగింది. మండలి సభ్యులకు చెందినవారు, ప్రముఖులు, స్థానిక నేతలు ఒకేసారి అక్కడికి రావడంతో సుమారు 3 గంటల పాటు క్యూలైన్లు స్తంభించిపోయాయి. ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ వాహనం నాలుగో గేటు వద్ద చిక్కుకుపోవడంతో ఆయన పరిపాలన భవనం చేరుకోవడానికి రద్దీలో ఇబ్బంది పడ్డారు. గంటలతరబడి క్యూలైన్లలో భక్తులు, వృద్ధులు, చంటిబిడ్డలతో అవస్థలు పడ్డారు. ఆగమ నియమానికి విరుద్ధంగా మూలమూర్తులకు సమర్పించే నైవేద్యం ఆలస్యమైందంటూ భక్తులు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సమన్వయం పాటించని చైర్మన్
జనసేన నేత కొట్టే సాయిప్రసాద్‌ను చైర్మన్‌గా, మరో 15మంది సభ్యులుగా, మరొకరిని ప్రత్యేక ఆహ్వానితులుగా వివిధ నియోజకవర్గాల నుంచి తొలిసారి నియమించారు. సహచర సభ్యులతో సమన్వయం పాటించడంలో సాయి విఫలమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, టీడీపీ సభ్యులు రెండు రోజుల క్రితం వేర్వేరుగా ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. ఆదివారం కూడా సీనియర్లతో సమన్వయం లేకుండా ర్యాలీలు, ఫ్లెక్సీలు వేశారన్న విమర్శలున్నాయి.