మొదలైన ముక్కోటి దర్శనాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:29 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు.
రంగనాథస్వామి ఆలయ సెట్టింగులో కొలువుదీరిన ఉత్సవర్లు
శోభాయమానంగా తిరుమల కొండ
తిరుమల, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. సోమవారం రాత్రి 10.30లోపే దర్శనాలను పూర్తిచేసి.. ఏకాంతసేవ నిర్వహించి 11.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. తిరిగి, అర్ధరాత్రి 12.05 గంటల తర్వాత వైకుంఠద్వారాలను తెరిచి కైంకర్యాల అనంతరం దర్శనానికి అనుమతించారు. జనవరి 8వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు తిరుమల క్షేత్రాన్ని పుష్ప, విద్యుత్ అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఎప్పటిలానే ఈసారి కూడా ఆలయం ముందున్న వాహన మండపం సమీపంలో ‘శ్రీరంగనాథమండపం’ కూడా సిద్ధం చేశారు. ఈ మండపంలో రంగనాథస్వామితో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టలక్ష్మీ, దశావతారాలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పండ్లు, కూరగాయాలు, పుష్పాలతో రంగనాథస్వామి ఆలయ సెట్టింగ్ వేశారు. మంగళవారం వేకువజాము వీఐపీ బ్రేక్ ముగిశాక స్లాట్ల వారీగా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. వీరికి శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రాంతాల వద్ద ఎంట్రీ గేట్లను ఉంచారు. టోకెన్లు ఉన్న వారికే తొలి మూడురోజులు దర్శనం ఉంటుందని టీటీడీ భారీ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా, సెలబ్రెటీలతో ప్రచారం చేయించారు. దీంతో వైకుంఠ ఏకాదశి ముందురోజు వచ్చే భక్తుల రద్దీ ఈసారి కనిపించలేదు. దాదాపు 90 శాతం మంది టోకెన్లు ఉన్నవారే తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశిన ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ద్వాదశి సందర్భంగా బుధవారం ఉదయం చక్రస్నానం జరుగుతుంది.
ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు: వైకుంఠద్వార దర్శనాల సందర్భంగా మంగళవారం నుంచి పది రోజులపాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు కానున్నాయి. తొలిమూడురోజులు టోకెన్లు ఉన్నవారికి, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు మాత్రమే కొనసాగనున్నాయి.