తొలగిన తుఫాన్ ముప్పు
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:37 AM
జిల్లాకు మొంథా తుఫాను ముప్పు పూర్తిగా తొలగిపోయింది. జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గత ఆదివారం నుంచీ అత్యంత అప్రమత్తంగా ఉంటూ రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించిన యంత్రాంగానికి టెన్షన్ తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడిన సమయంలో వాతావరణ పరిశోధనా కేంద్రం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
తిరుపతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మొంథా తుఫాను ముప్పు పూర్తిగా తొలగిపోయింది. జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గత ఆదివారం నుంచీ అత్యంత అప్రమత్తంగా ఉంటూ రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించిన యంత్రాంగానికి టెన్షన్ తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడిన సమయంలో వాతావరణ పరిశోధనా కేంద్రం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ నుంచీ అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జిల్లాలో ఐదు మండలాలు సముద్ర తీరాన ఉండటం, మరిన్ని మండలాలు తీరానికి చేరువగా ఉండటంతో అధికార యంత్రాంగం ఆందోళనకు గురైంది. జిల్లాలో వెలిగొండ, శేషాచల కొండలున్న కారణంగా భారీ వర్షాలకు కైవల్య, స్వర్ణముఖి నదులు, పలు వాగులూ ఉధృతంగా ప్రవహిస్తాయి. అలాగే దక్షిణాన కాళంగి, అరుణా నదులు, ఇతర వాగులు సైతం జోరుగా పారుతాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు సునాయాసంగా నిండిపోతాయి. ఇక, వర్షాల తీవ్రత పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, చెరువులకు గండ్లు పడడం, పంటలు నీట మునగడం, రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు కొట్టుకుపోవడం వంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఈ అనుభవాల నేపథ్యంలో మొంథా తుఫానుతో జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడం యంత్రాంగాన్ని కలవరపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎ్‌సను ప్రత్యేక అధికారిగా పంపడంతో పాటు తక్షణ సహాయక చర్యలకు నిధులు కూడా కేటాయించింది. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా పంపింది. మరోవైపు మండల స్థాయిల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయించిన కలెక్టర్ మూడు రోజుల పాటు సచివాలయాల స్థాయిలో రాత్రింబవళ్ళు ఉద్యోగులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ, ప్రత్యేకాధికారులతో పాటు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పరిశీలిస్తూ వచ్చారు. అయితే మంగళవారం సాయంత్రానికే తుఫాను ముప్పు తగ్గిందని ప్రభుత్వం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ముప్పు తగ్గినా ప్రత్యేకించి తీరానికి చేరువగా వున్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. చివరికి బుధవారం ఆ ముప్పును కూడా జిల్లా తప్పించుకుంది. మూడు రోజుల పాటు ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. వెయ్యి హెక్టార్ల వరకూ పంటలు నీట మునగడంతో పాటు 16 ఇళ్ళు కూలిపోవడం, కొన్ని చెరువులకు గండ్లు పడడం, రోడ్లు దెబ్బతినడం మినహా ఎక్కడా ప్రాణ నష్టం జరగకపోవడం అధికార యంత్రాంగానికి ఊరట కలిగించింది. తొలుత భయపడ్డ స్థాయిలో నష్టాలు సంభవించకపోవడంతో అధికారులతో పాటు ప్రజలకు సైతం ఉపశమనాన్నిచ్చింది. బుధవారం ఉదయం నుంచి ఎండ రావడంతో.. జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. జిల్లాలో కొన్ని వాగులు బుధవారమూ ఉధ్రుతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు పరిశీలించారు.
‘విధులకు డుమ్మా’పై ఆందోళన
తడ, ఆంధ్రజ్యోతి: తుఫాన్ సమయంలో కొందరు అధికారులు, ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టడంపై ఆంధ్రజ్యోతిలో బుధవారం కథనం వెలువడటంతో చర్చనీయాంశమైంది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో ఎవరిపై చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన కొందరు అధికారుల మాటల్లో బయటపడింది.