Share News

ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌పై అనుమానమే నిజమైంది!

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:44 AM

చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసేందుకు 10 కేటగిరిల్లో 56 పోస్టులకు గత నెల 9వ తేదిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌పై అనుమానమే నిజమైంది!

చిత్తూరు రూరల్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి):నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసేందుకు 10 కేటగిరిల్లో 56 పోస్టులకు గత నెల 9వ తేదిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు అదే నెల 22దాకా గడువు విధించారు. 56 పోస్టులకు గాను మొత్తం 2093మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 7వ తేదిన ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేస్తామని, 15న జాబితాపై ఏదైనా సందేహాలుంటే గ్రీవెన్స్‌కు అవకాశం కల్పించి అదే రోజున ఫైనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నవంబరు 20న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తామని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అయితే గడువు దాటినా జాబితా విడుదల కాలేదు.కొన్ని కేటగిరీలకు అనుమతి లేకుండానే నోటిఫికేషన్‌ ఇవ్వడమే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.రాష్ట్రస్థాయి అధికారుల అనుమతి లేకుండానే ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో అక్టోబరు 16వ తేదిన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. 10కేటగిరిల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే 3 కేటగిరిల్లో పోస్టులను భర్తీ చేసుకునేందుకు మాత్రమే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

దరఖాస్తుల వివరాలివీ

మెడికల్‌ ఆఫీసరు- 13 పోస్టులకు గాను 97 దరఖాస్తులు, స్టాఫ్‌ నర్స్‌ 20 పోస్టులకు 1374, ఫైనాన్స్‌ కమ్‌ లాజిస్టిక్‌ కన్సల్టెంట్‌ 1పోస్టుకు 45, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2పోస్టులు మూడింటికి గాను 142, ఫిజియోథెరఫిస్ట్‌ ఒక పోస్టుకు 50, శానిటరి అటెండెంట్‌ 2పోస్టులకు 47, సపోర్టింగ్‌ స్టాఫ్‌ 4పోస్టులకు 139, సెక్యురిటీ గార్డ్‌ 2పోస్టులకు 43, లాస్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ 8పోస్టులకు 156 దరఖాస్తులు వచ్చాయి. ఆడియో మెట్రి 2పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మొత్తం 56 పోస్టులకు 2093 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

మూడు కేటగిరిలకు మాత్రమే అనుమతి

మొత్తం 10 కేటగిరిలో పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరఫిస్ట్‌ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతి ఇచ్చారని సమాచారం.అయితే మిగిలిన పోస్టులకు సంబంధించి ఒక్కొక్కరు రూ.500 పెట్టి దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా నోటిఫికేషన్‌లో పోస్టులకు రోస్టర్‌ను ప్రకటించకపోవడంతో అనుమతి ఇచ్చిన మూడు కేటగిరిల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నష్టపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు... ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు ఓసీ మహిళ అని రోస్టర్‌లో ఉంటే ఆ పోస్టుకు ఓసీలో పురుషుడైనా అర్హత ఉండదు. అలాంటిది వేరే కులానికి చెందిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ అభ్యర్థి నష్టపోవాల్సిందే. ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేసినా రోస్టర్‌ తప్పనిసరిగా నోటిఫికేషన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. రోస్టర్‌కు అనుగుణంగా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుంటారు. అయితే గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రోస్టర్‌ను పొందుపరచకపోవడంతో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డబ్బును, సమయాన్ని వృధా చేసుకున్నట్లయింది.దీంతో అనేకమంది అభ్యర్థులు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి తిరిగి రోస్టర్‌తో నూతన నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:44 AM