Share News

‘పింక్‌ డైమండ్‌ ’ కథ కంచికి

ABN , Publish Date - Sep 11 , 2025 | 01:35 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పింక్‌ డైమండ్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్‌ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్టు కొన్ని సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి.

‘పింక్‌ డైమండ్‌ ’ కథ కంచికి
మైసూరు మహారాజు సమర్పించిన హారం ఫొటో , మైసూరు మహారాణి ప్రమోదదేవితో మునిరత్నంరెడ్డి , మైసూరు మహారాజు హారంపై వివాదం నేపథ్యంలో రూబీ అంటూ టీటీడీ విడుదల చేసిన ఫొటో

మైసూర్‌ మహారాజు సమర్పించిన హారంలో వున్నది రూబీ మాత్రమే

సాక్ష్యాలతో నిరూపించిన ఆర్కియాలజిస్టు మునిరత్నం రెడ్డి

తిరుమల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పింక్‌ డైమండ్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్‌ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్టు కొన్ని సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో రాజకీయ విమర్శలతో పింక్‌ డైమండ్‌ వ్యవహరం పెద్దఎత్తున చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని, టీటీడీని ఇబ్బందుల్లోకి నెట్టేలా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యమని తేల్చిచెప్పేలా కొన్ని ఆధారాలను ఆర్కియాలజీ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి బయటపెట్టారు.

1945లో హారం బహూకరించిన మైసూరు మహారాజు

శ్రీవారికి విలువైన ఆభరణాలు బహూకరించిన రాజుల్లో మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్‌ కూడా ఒకరు. 1945 జనవరి 9వ తేదీన ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. మహారాజ పర్యటనకు సంబంధించి మైసూరు ప్యాలెస్‌ నుంచి 1944 డిసెంబరు 29వ తేదీన రామయ్య అనే ప్యాలెస్‌ అధికారి టీటీడీ కమిషనర్‌కు లేఖ రాశారు. రైలు ద్వారా 1945 జనవరి 9న ఉదయం 8 గంటలకు రేణిగుంటకు చేరుకునే మహారాజు తిరుపతి, శ్రీకాళహస్తి రాకపోకలకు రెండు మంచి కార్లను ఏర్పాటు చేసేందుకు సహకరించాలంటూ ఆ లేఖలో కోరారు. ఈ సందర్భంలోనే టూర్‌ షెడ్యూల్‌ కాపీని కూడా పంపారు.ఈ పర్యటనలోనే మైసూరు మహారాజు శ్రీవారికి హారాన్ని సమర్పించారు.ఆ హారాన్ని టీటీడీ కొన్నేళ్లుగా విశేష ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది.2001 అక్టోబరు 21న జరిగిన గరుడసేవలో మలయప్పస్వామికి ఈ హారాన్ని అలంకరించారు. అయితే వాహనసేవను వీక్షిస్తున్న భక్తులు విసిరిన నాణేలు తగలడంతో ఆ ఆభరణంలో కెంపు రాయి విరిగిపోయింది. ఆ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్‌లో కూడా నమోదు చేశారు.

జెనీవాలో వేలం వేశారన్న రమణదీక్షితులు

మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో ఉన్నది కెంపు రాయి కాదని, కోట్ల విలువైన పింక్‌ డైమండ్‌ అని, ఆ డైమండ్‌ను అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారంటూ 2018లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే కైంకర్యాలు సరిగా జరగడం లేదని, నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు నిర్వహించారని కూడా ఆయన ఆరోపణలు చేయగా టీటీడీ కూడా అదేస్థాయిలో స్పందించింది. రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయంపై జగన్నాధరావు కమిటీ ఇచ్చిన నివేదికలో పగిలిన కెంపు ముక్కలు పేష్కార్‌ ఆధీనంలో ఉన్నాయని తెలియజేసినట్టు వివరణ ఇచ్చింది.ఆ కెంపు విలువ రూ.50గా నిర్ధారించినట్టు రికార్డులున్నాయంటూ రమణదీక్షితుల ఆరోపణలను కొట్టిపడేసింది. అయితే స్వామికి అనేక ఏళ్లు దగ్గరుండి కైంకర్యాలు నిర్వహించిన రమణదీక్షితులు చెప్పడంతో పలువురు భక్తులు సందేహంలో పడ్డారు.

గతంలోనూ మాజీ న్యాయమూర్తుల తనిఖీలు

శ్రీవారి ఆభరణాల భద్రతపై గతంలో కూడా విమర్శలు వచ్చాయి. రాయల వారిచ్చిన ఆభరణాలతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయంటూ ఆరోపణలు రావడంతో 2009 సెప్టెంబరు నెలలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జగన్నాధరావు నేతృత్వంలో ఓ కమిటీ, 2010లో జస్టిస్‌ వాద్వా నేతృత్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు.టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదికతో పాటు అధికారుల వద్దనున్న తిరువాభరణాల రిజిస్టర్‌ను వాద్వా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఆభరణాలు సక్రమంగానే ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేసింది. జగన్నాథరావు కమిటీ కూడా 1952 నుంచి ఉన్న రికార్డుల ప్రకారం ఏ ఆభరణం మిస్‌ కాలేదని నివేదికలో పేర్కొంది. కాగా ఆభరణాల భద్రత, వివరాలను పొందుపరచడంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన కానుకల వివరాలు టీటీడీకి అప్పజెప్పినప్పటికీ తిరువాభరణాల లిస్ట్‌లో లేవని తేల్చిచెప్పారు.2001బ్రహోత్సవాల్లో పగిలింది కెంపు మాత్రమేనని, భక్తులు నాణేలు విసిరినప్పుడు అది విరిగిందని రమణదీక్షితులే గుర్తించినట్టు ఆ నివేదికలో ఉంది.కెంపు స్థానంలో వెంటనే ఓ పగడం కూడా తిరిగి అమర్చినట్టు కమిటీ వివరించింది.

రూ.200 కోట్లకు పరువునష్టం దావా

భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు, వైసీపీ అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిపై రూ.200 కోట్ల పరువు నష్టం దావాను టీటీడీ వేసింది. దీనికి రూ.2 కోట్లు ఫీజు కూడా అప్పటి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందం చెల్లించింది.వైసీపీ అధికారం లోకి వచ్చాక ఆ కేసును ఉపసంహరించుకోవడంతో కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్ల ఫీజు ఎవరిస్తారని, స్వామి నిధులు ఇలా దుబారా చేస్తారా అంటూ భారీగా విమర్శలొచ్చాయి. అయితే అంతకుముందు నానాయాగీ చేసి, భక్తుల్లో అనేక సందేహాలు రేకెత్తిం చిన వారంతా సమా ధాన మివ్వ కుండా తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉండిపోయారు.

వెలుగులోకి డైమండ్‌ కాదని సాక్ష్యాధారాలు

మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్‌ డైమండ్‌ అనేది లేదని పలు సాక్ష్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.మైసూరులోని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌(ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి ఈ అంశంపై కొద్దిరోజుల పాటు పరిశోధన చేశారు. మైసూరు మహారాణి ప్రమోద దేవిని కలవడంతో పాటు ప్యాలె్‌సలోని కొన్ని రికార్డులను పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఆ హారాన్ని రూ.8,500కు ఢిల్లీలో తయారు చేయించినట్టు తేలింది. ప్యాలె్‌సలోని ఆభరణాల రికార్డుల్లోనూ శ్రీవారికి సమర్పించిన హారంలో ఎలాంటి డైమండ్‌ ఉన్నట్టు లేదు. దీంతో గతంలో చేసిన విమర్శలు తాజా ఆధారాలతో అవాస్తవాలుగా తేలాయి. ఈ అంశంపై మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. ‘స్వామివారి విషయాల్లో లేనిపోని అభాండాలు వేయకూడదు. తప్పుడు ప్రచారాలు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే. మా పరిశోధనలో రాజు సమర్పించిన హారంలో డైమండ్‌ లేదని తేలింది. దేవాలయాల విషయాల్లో రాజకీయాలు చేయడం సరికాదు’ అని అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 11 , 2025 | 01:35 AM