కొలువుదీరిన ఏడు గంగమ్మలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:55 AM
శ్రీకాళహస్తికే ప్రత్యేకమైన ఏడు గంగమ్మల జాతర బుధవారం ఘనంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది. అమ్మవార్లు కొలువుదీరే ఏడు ప్రాంతాల్లో మూడు రోజుల ముందు నుంచే చలువు పందిళ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏడు ప్రాంతాల్లో అమ్మవారి ఉత్సవమూర్తులు మంగళవారం అర్ధరాత్రిపైన విశేష అలంకారంలో ఊరేగింపునకు సిద్ధం చేశారు.
రాత్రి ఘనంగా నిమజ్జనం
రోజంతా మొక్కులు చెల్లించుకున్న భక్తులు
శ్రీకాళహస్తికే ప్రత్యేకమైన ఏడు గంగమ్మల జాతర బుధవారం ఘనంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది. అమ్మవార్లు కొలువుదీరే ఏడు ప్రాంతాల్లో మూడు రోజుల ముందు నుంచే చలువు పందిళ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏడు ప్రాంతాల్లో అమ్మవారి ఉత్సవమూర్తులు మంగళవారం అర్ధరాత్రిపైన విశేష అలంకారంలో ఊరేగింపునకు సిద్ధం చేశారు. బుధవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఏడుగంగమ్మలు వరుసగా శ్రీకాళహస్తి న్యాయస్థాన భవనం సమీపంలోని ఏడుగంగమ్మల ఆలయం వద్దకు చేరుకున్నాయి. కుంభం, ప్రత్యేక పూజల తర్వాత అమ్మవార్ల ముసుగు తొలగించి భక్తులకు దర్శనం కల్పించారు. మంగళవాయిద్యాలు, బ్యాండు మేళాలు, సాంస్కృతిక కళాబృందాల ప్రదర్శనలు, యువత చిందుల నడుమ ఏడుగురు అమ్మవార్లు ఒకరి వెనుక ఒకరు.. వరుసగా సాగారు. పలువురు అమ్మవార్లకు కుంభం, కోడిపుంజులు, వేటలు సమర్పించారు. పెండ్లిమండపం నుంచి ఎక్కడి ప్రాంతాల అమ్మవార్లు అక్కడకు వెళ్లి కొలువుదీరారు. పట్టణమంతా ఏడుగంగమ్మలు కొలువుదీరిన ప్రాంతాల్లో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఎటు చూసినా భక్తజన సందడే కనిపించింది. పట్టణంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇక, పలువురు భక్తులు అమ్మవారికి అంబళ్లు పోశారు.
కన్నులపండువగా నిమజ్జనం
బుధవారం రాత్రి ఏడుగంగమ్మలు ఆయా ప్రాంతాల నుంచి తిరిగి ఊరేగింపుగా సాగారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ముత్యాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం అక్కడ ఒక్కో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం నిర్వహించారు.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి