Share News

మళ్లీ మళ్లీ అవే మెయిల్స్‌

ABN , Publish Date - May 29 , 2025 | 12:11 AM

ఏడు నెలలుగా తిరుపతికి బాంబు బెదిరింపులు తాజాగా కలెక్టరేట్‌కు, వ్యవసాయ కళాశాలకు

మళ్లీ మళ్లీ అవే మెయిల్స్‌
కలెక్టరేట్‌లో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను తనిఖీ చేస్తు బాంబ్‌ స్క్వాడ్‌

మీ హోటళ్లలో బాంబులు పెట్టాం.. పేల్చేస్తాం. గతేడాది అక్టోబరు 24న ఉదయం 11.56 గంటలకు మొదలైన ఈ తరహా బెదిరింపు ఈ-మెయిల్స్‌ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి కలెక్టరేట్‌కు రెండోసారి.. వ్యవసాయ కళాశాలకు మూడోసారి బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఎప్పటిలాగే.. ఇవీ ఉత్తుత్తివేనని నిర్ధారణ అయ్యాయి.

తిరుపతి(నేరవిభాగం), మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని లక్ష్యంగా చేసుకుని ఏడు నెలలుగా... తరచూ బాంబు బెదిరింపు మెయిల్స్‌ వస్తూనే ఉన్నాయి. తొలిసారిగా నాలుగు హోటళ్లకు మెయిల్స్‌ రావడంతో ఆందోళన మొదలైంది. తమిళనాడులో జాఫర్‌ షాదిక్‌కు జైలుశిక్ష విధించిన క్రమంలో బాంబులు పెట్టినట్లు ఐఎ్‌సఐ ఉగ్రవాదుల పేరిట మెయిల్స్‌ రావడంతో పోలీసులు, బాంబు, డాగ్‌ స్క్వాడ్ల సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబులు లేవని నిర్ధారించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదే రోజున తిరుపతి మీదుగా నడిచే స్టార్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని బాంబుతో పేల్చివేస్తామంటూ ట్విట్టర్‌ ద్వారా అగంతకుడొకరు బెదిరించారు. మూడు రోజుల వ్యవధిలోనే అక్టోబరు 27న ఇస్కాన్‌ టెంపుల్‌ను పేల్చేస్తామంటూ ఆలయంలో అతిథి గృహాలు బుక్‌చేసే ఐడీకి మెయిల్‌ వచ్చింది. అదే రోజున మరో ఆలయంతో పాటు ఐదు హోటళ్లకూ ఇదే తరహా మెయిల్స్‌ రావడంతో పోలీసులు గంటలపాటు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఆ తర్వాత కొన్ని మెయిల్స్‌ వచ్చాయి. డిసెంబరు 13న వ్యవసాయ కళాశాలకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు హార్ధిక్‌ పీటర్స్‌ అనే వ్యక్తి మెయిల్‌ ఐడీ నుంచి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికార మెయిల్‌ ఐడీకి మార్చి 21న మెయిల్‌ వచ్చింది. ఇలా దుండగుల నుంచి మెయిల్స్‌ రావడం.. పోలీసులు, బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టడం.. బాంబులు, పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడం పరిపాటిగా మారింది. ఇక్కడితో ఆగిందనుకున్న ఈ బెదిరింపుల మెయిల్స్‌ బుధవారం మళ్లీ కలెక్టరేట్‌కు.. మూడోసారి వ్యవసాయ కళాశాలకు వచ్చాయి. దీంతో కొంత కలకలం రేపింది. ఇలా తిరుపతికి వరుస పెట్టి బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపుతున్నది ఎవరు? ఎక్కడ నుంచి పంపుతున్నారు? అనేది పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో అదే తరహా మెయిల్స్‌ వస్తున్నాయి.

రెండోసారి కలెక్టరేట్‌కు..!

తమిళనాడు నుంచి బాంబు బెదిరింపు మెయిల్‌

తిరుపతి కలెక్టరేట్‌కు రెండోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. జైస్మాల్‌ ముస్తాక్‌ సవుక్కు శంకర్‌ మద్రాస్‌ టైగర్స్‌ పేరిట జేసీ శుభం బన్సల్‌కు మంగళవారం సాయంత్రం అధికారికంగా మెయిల్‌ చేశారు. పాక్‌ జిందాబాద్‌.. జిల్లా కలెక్టరేట్‌లో ఆర్‌డీఎక్స్‌ అమర్చామని అందులో పేర్కొన్నారు. అందులో సోమవారం మధ్యాహ్నం 1.13 గంటలకు బాంబులు పేలేలా అమర్చామని ఉండటం గమనార్హం. వెంటనే అధికారులు ఈ మెయిల్‌ను ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుకు ఫార్వార్డ్‌ చేసి సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించిన పోలీసు అధికారులు ఎలాంటి అనుమానాస్పద అంశాలూ లేవని నిర్ధారించుకున్నారు. బుధవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పార్కింగ్‌లోని వాహనాలను తనిఖీ చేశారు. అన్ని విభాగాల్లోనూ తనిఖీచేసిన బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది చివరికి అంతా ఉత్తిదేనని తేల్చడంతో కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ మార్చి 21న ఇదే తరహాలో బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే.

మూడోసారి వ్యవసాయ కళాశాలకు..

తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. శివదాస్‌ మీనా అనే పేరుతో ఉదయం 9 గంటలకు ఈ మెయిల్‌ అందింది. అందులో అఫ్జల్‌ గురూను ఉరి తీసినందుకు, తమిళనాడులో సవుక్కు శంకర్‌ పట్ల డీఎంకే వ్యవహరించిన తీరుకు నిరసనగా కాలేజీలో పైప్‌ బాంబులు అమర్చినట్టు పేర్కొన్నారు. ఇవి ఏ క్షణమైనా పేలే అవకాశాలున్నాయని ఆ మెయిల్‌లో హెచ్చరించారు. ఈ మెయిల్‌ విషయమై రూరల్‌ సీఐ చిన్నగోవిందుకు అధికారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు, డాగ్‌, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది కళాశాలకు చేరుకుని ప్రిన్సిపల్‌, డీన్‌, రిజిస్ట్రార్‌ చాంబర్లతో పాటు తరగతి గదులు, హాస్టళ్లు, ల్యాబ్‌లు, కళాశాల చుట్టు పక్కల ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్‌ పరికరాలతో తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు లేవని అంతా ఫేక్‌ మెయిల్స్‌ అని తేల్చారు. ఈ వ్యవసాయ కళాశాలకు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం ఇది మూడోసారి.

Updated Date - May 30 , 2025 | 03:05 PM