Share News

హైందవ ధర్మ పరిరక్షణలో నాయీ బ్రాహ్మణుల పాత్ర కీలకం

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:22 AM

హైందవ ధర్మాన్ని రక్షించడంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. వారి సంప్రదాయ వృత్తి కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందని, తద్వారా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

హైందవ ధర్మ పరిరక్షణలో నాయీ బ్రాహ్మణుల పాత్ర కీలకం
శోభాయాత్రలో బీజేపీ నేతలు మాధవ్‌,రామచంద్రరావు తదితరులు

తిరుపతి(ఉపాధ్యాయనగర్‌), అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): హైందవ ధర్మాన్ని రక్షించడంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. వారి సంప్రదాయ వృత్తి కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందని, తద్వారా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి వృత్తి కార్పొరేట్‌పరం కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రులు, జైళ్లు, పోలీసు శాఖల్లో నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయాల్లో నాదస్వరం, డోలు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుపతిలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర, సభా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మాధవ్‌ పాల్గొన్నారు. ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్రం కంటే ముందే విదేశీ శక్తులు వర్ణ వివక్షతో బీసీ కులాలపై దాడి చేశాయన్నారు. సనాతన హిందూ ధర్మంలో బీసీ కులాల పాత్ర కీలకమని వివరించారు. బీసీ కులాలను వివక్ష నుంచి విముక్తి చేయడానికి ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని నిర్వహించినట్లు చెప్పారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. దీనికిముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, సురేష్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ మాట్లాడారు.

కన్నులపండువగా శోభాయాత్ర

ధన్వంతరి జయంతి ఉత్సవంలో భాగంగా తిరుపతిలో శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. బాలాజీకాలనీ పూలే విగ్రహం నుంచి గాంధీభవన్‌ వరకు సాగిన ఈ యాత్రలో నాయీ బ్రాహ్మణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితర ప్రముఖులు గాంధీభవన్‌ వేదికగా ధన్వంతరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, దీపప్రజ్వలనతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకురాలు, గాయని ఎంఎం శ్రీలేఖ ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి.

Updated Date - Oct 19 , 2025 | 01:22 AM