Share News

లిక్కర్‌ స్కాంలో మిథున్‌రెడ్డి అరెస్టుపై స్పందన అంతంతే!

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:07 AM

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ స్పందన, ఆ పార్టీ జిల్లాలో ఎంత బలహీనంగా మిగిలిందో వెల్లడిస్తోంది.

లిక్కర్‌ స్కాంలో మిథున్‌రెడ్డి అరెస్టుపై స్పందన అంతంతే!

చిత్తూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ స్పందన, ఆ పార్టీ జిల్లాలో ఎంత బలహీనంగా మిగిలిందో వెల్లడిస్తోంది. రాజకీయంగా ఉమ్మడి జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, జగన్‌కి అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత ఎంపీ మిఽథున్‌రెడ్డి అరెస్టు పట్ల జనంలో వ్యతిరేకత లేకపోయినా, కనీసం పార్టీలో అయినా తగినంత స్పందన లేకపోవడం ఏమిటని.. వైసీపీ నేతలో ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది నాయకులు మీడియా మీట్‌లూ, ప్రకటనలకే పరిమితం కావడం, అక్కడక్కడా చిన్నపాటి నిరసనలతో సరిపెట్టుకోవడం వారిని ఆందోళన పెడుతోంది. పెద్దిరెడ్డి రాజ్యంగా విలసిల్లిన పుంగనూరు నియోజకవర్గంలోనూ నీరసంగానే నిరసన సాగడం విశేషం.

మద్యం కుంభకోణం విషయంలో మిథున్‌రెడ్డిని శనివారం ఏడు గంటలపాటు విచారించిన సిట్‌, అదే రోజు రాత్రి అరెస్టు చేసింది. శని, ఆదివారాల్లో వైసీపీ నాయకులు జిల్లాలో ఎక్కడా నిరసనలు చేయలేదు. పత్రికా ప్రకటనల్ని మాత్రమే విడుదల చేశారు. సోమవారం వైసీపీ అధిష్ఠానం ఆదేశించడంతో, కొన్నిచోట్ల నామమాత్రంగా నిరసనలు చేశారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాలతో పాటు మిథున్‌రెడ్డి సొంత ప్రాంతం సదుంలో సుమారు 100-150 మందితో నిరసనలు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో కాసేపు రోడ్ల మీద ప్లకార్డులతో నిలబడి వెళ్లిపోయారు. ఈ తీరుపై వైసీపీలోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది.

జనంలో సానుభూతి కరువు..

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ధరలు విపరీతంగా ఉండడం, ఊరూపేరూ లేని కొత్త బ్రాండ్లు మాత్రమే అమ్మడం, వాటి వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవడం వంటి కారణాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందని భావిస్తున్నారు. దీనికి కారకులైన వారిపట్ల కనీస సానుభూతి కూడా ఇందువల్లే కరువైందని అంటున్నారు. పైగా వేల కోట్ల సొమ్ములు దోచుకున్న తీరు మీడియాలో కథనాలుగా వస్తుండంతో ఇంతకు తెగించారా అని ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు. అందుకే అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రతి పండక్కీ పబ్బానికీ వందల కోట్లు ఖర్చు పెట్టి బట్టలు, కానుకలూ, మిఠాయిలూ పంపినా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటివారి పట్ల కూడా చంద్రగిరి నియోజకవర్గంలో సైతం సానుభూతి లేదని జనంలో చర్చ నడుస్తోంది. జనంలో సానుభూతి లేకపోవడం వల్లే వైసీపీ నాయకులు కూడా వారి తరహా బలప్రదర్శనతో కూడిన నిరసనలకు ధైర్యం చేయలేకపోతున్నారని అంటున్నారు.

వైసీపీలోనూ వ్యతిరేకత..

పెద్దిరెడ్డి కుటుంబంపై జిల్లా వైసీపీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉండడంతోనే అరెస్టుపై అనుకున్నంత స్పందన లేదని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలకు వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించడం.. మైన్‌, వైన్‌, సాండ్‌, ల్యాండ్‌ వంటి అన్నింట్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులకు అందకుండా తనే నడపడం.. వంటి కారణాలతో ఆ కుటుంబంపై జిల్లా వైసీపీ నాయకుల్లో వ్యతిరేకత ఉందనే విషయం ఇప్పుడు వెల్లడవుతోందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

ఇదీ పెద్దిరెడ్డి ఘనత..

జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి చక్రం తిప్పిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో పూతలపట్టు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను కాదని ఎంఎ్‌సబాబును తెరపైకి తెచ్చారు. 2024లో మళ్లీ ఎంఎ్‌సబాబును ఇబ్బంది పెట్టారు. సునీల్‌కుమార్‌ అప్పట్లో జగన్‌ ఇంటి ఎదుట రోజంతా నిలబడినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని వీడియో దళిత సంఘాల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. 2014లో ఎంఎ్‌సబాబుతో పాటు సత్యవేడు ఆదిమూలానికీ టికెట్‌ రాకుండా చేయడంతో ఇద్దరూ పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పెనుమూరుకు చెందిన మాజీ ఎంపీ జ్ఞానేందర్‌రెడ్డిని ప్రోత్సహించి డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలున్నాయి. నగరిలో రోజాను ఇబ్బంది పెట్టేందుకు చక్రపాణిరెడ్డి, కేజే కుమార్‌ వంటివారిని ప్రోత్సహించారు. చిత్తూరులో అటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని, ఇటు విజయానందరెడ్డినీ ఎదగనీయకుండా పావులు కదిపేవారు. ఎన్నికల సమయంలో విజయానందరెడ్డితో బాగుంటూనే ఆయనకు టికెట్‌ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపణలున్నాయి. జనసేనలోకి ఆరణి వెళ్లిపోయేలా చేశారు. ఈ ఇద్దర్ని కాకుండా మూడో వ్యక్తి కోసం ప్రయత్నించినట్లు సమాచారం. పలమనేరులో వెంకటేగౌడకు చెక్‌ పెట్టేందుకు బైరెడ్డిపల్లె కృష్ణమూర్తిని విపరీతంగా ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి. అధికారులు కూడా కృష్ణమూర్తికి ప్రాధాన్యతనిచ్చేవారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ను పక్కన పెట్టుకుంటూనే సెంథిల్‌కుమార్‌ను వ్యతిరేక వర్గంగా మార్చారు.

మదనపల్లెలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు 2024లో టికెట్‌ రాకుండా చేశారు. అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యే అయినటువంటి పీలేరు చింతల రామచంద్రారెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్‌ పదవి రాకుండా చేసి తమ అనుచరుడు పోకల అశోక్‌కుమార్‌కు వచ్చేలా చేశారు. తిరుపతి, చంద్రగిరిల్లోనూ ఆయన చాపకింద నీరులా వ్యవహరించేవారని అంటారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జగన్‌కు సన్నిహితంగా ఉండడం ఆయనకు మింగుడు పడేది కాదంటారు. చెవిరెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో తన ప్రత్యర్ధి పట్ల పెద్దిరెడ్డి ఎన్నడూ వ్యతిరేకంగా లేరని అనేవారు. తిరుపతి జిల్లాలో కూడా తనకు ప్రొటోకాల్‌ ఉండాలని తన నియోజకవర్గంలోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను తిరుపతిలో కలిపేందుకు పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నాలను చెవిరెడ్డి అడ్డుకున్నారని అంటారు. తిరుపతిలోనే నివాసం ఉండే పెద్దిరెడ్డి తిరుపతి నగరంలోనూ, చుట్టుపక్కలా భూవ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు. సిటింగ్‌ ఎమ్మెల్యేకి ఇది ఇబ్బందిగా ఉన్నా జగన్‌తో వారికున్న పలుకుబడి వల్ల మౌనంగా భరించేవారని చెప్పుకుంటారు. మొత్తానికి ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ పెత్తనం సాగించినందునే పెద్దిరెడ్డి కుమారుడు అరెస్టు పట్ల ఎక్కడా బలమైన నిరసనలు లేవని భావిస్తున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 10:56 AM