Share News

వరి రైతు వెన్ను విరిచిన వర్షం

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:17 AM

మొన్నటి వరకు పంటను తడుపుకొనేందుకు వర్షం కోసం రైతులు ఎదురుచూశారు. వరి ఎన్ను దశకొచ్చిన ఈ సమయంలో ఆ వర్షమే రైతు వెన్ను విరిచింది.

వరి రైతు వెన్ను విరిచిన వర్షం
సూళ్లూరుపేట మండలం మంగళంపాడు సమీపంలో నేల వాలిన వరిపైరు

కోట/సూళ్లూరుపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మొన్నటి వరకు పంటను తడుపుకొనేందుకు వర్షం కోసం రైతులు ఎదురుచూశారు. వరి ఎన్ను దశకొచ్చిన ఈ సమయంలో ఆ వర్షమే రైతు వెన్ను విరిచింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు, గాలితో వరి కోత దశలో ఉన్న వరిపైరు పూర్తిగా వాలిపోయింది. నీళ్లల్లో మొలకెత్తే దశకు చేరుకోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోట మండలంలోని గూడలి, దక్షిణపొలం, రాజుపాళెం, తిన్నెపూడి, తాటితోపు, ఊనుగుంటపాళెం, రుద్రవరం గ్రామాల్లో రైతులు వరి ఎడగారు సాగు చేపట్టారు. ఆయా పంటలు వెన్నుదశలో, కోత దశలో ఉండగా నేలపై వాలిపోయి కోత కోసేందుకు వీల్లేకుండా పోతోంది. సూళ్లూరుపేట మండలం మంగళంపాడు, మంగానెల్లూరు, కోటపోలూరు, సామంతమల్లాం, మన్నారుపోలూరు, ఇలుపూరు గ్రామాల్లోనూ కోత దశకు వచ్చిన వరిపైరు వర్షం ధాటికి నేలకొరిగింది. ఎన్నుదశలో ఉన్న వరిపైరు వాలిపోవడంతో కోతకు ఇబ్బందిగా మారింది. మొలకలు వస్తే నష్టపోవడమే. పలుచోట్ల వర్షంలోనూ రైతులు పంట నూర్పిడి చేస్తున్నారు. వచ్చిన అరకొర పంటను అమ్ముకుని బయటపడుతున్నారు. మరో రెండు రోజులు ఇదే విధంగా గాలులు, వర్షం కురిస్తే పొలాల్లో వాలిపోయి ఉన్న వరి పైర్లన్నీ మొలకెత్తి పనికిరాకుండా పోతాయి. పెళ్లకూరు మండలంలోనూ వరి కోత దశకురాగా.. వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - Aug 18 , 2025 | 01:17 AM