డంపింగ్ యార్డుకు రాజకీయ రంగు
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:57 AM
సూళ్లూరుపేట మున్సిపాలిటీకి కేటాయించిన డంపింగ్ యార్డు స్థలంపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమికి రాజకీయ రంగు పులుముకుంది.
ప్రభుత్వం కేటాయించిన స్థలంపై పక్క గ్రామస్తుల ఆందోళన
వైసీపీ నాయకుల ప్రమేయంపై ఆరోపణలు
సూళ్లూరుపేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట మున్సిపాలిటీకి కేటాయించిన డంపింగ్ యార్డు స్థలంపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమికి రాజకీయ రంగు పులుముకుంది. పక్క మండలానికి చెందిన గ్రామస్తులు వచ్చి చెత్త, వ్యర్థాలను తీసుకొచ్చే ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. వీరి ఆందోళన వెనుక స్థానికంగా కొందరు వైసీపీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం డంపింగ్ యార్డుకు కేటాయించిన భూమి సూళ్లూరుపేట మండలం కొణ్ణంబట్టు గ్రామ పరిధిలోనిది. అయితే, ఇక్కడ డంపింగ్ యార్డు వద్దంటూ పది కిలోమీటర్లకుపైగా దూరమున్న.. వరదయ్యపాళెం మండలం ఇసకపాలెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్ యార్డుకు సమీపంలోని చెరువు జలాలు కలుషితమవుతాయని చెబుతున్నారు. ఇక ఈ స్థలానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని కొణ్ణంబట్టు, పెరిమిటిపాడు గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళనలో పాల్గొనడం లేదు. ఇసకపాలెం గ్రామస్థుల అభ్యంతరం వెనుక.. కొందరు వైసీపీ నేతల హస్తముందన్న విమర్శలున్నాయి. ఎందుకంటే ఆందోళనకు వచ్చిన వారిలో ఆ పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డంపింగ్ యార్డుకు కేటాయించిన భూమిని వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఇప్పటికీ అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక, సూళ్లూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి దశాబ్దాల నుంచి డంపింగ్ యార్డుకు స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో కొణ్ణంబట్టు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 131లో 10 ఎకరాలను కేటాయిస్తూ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీకి సంబంధిత పత్రాలు, స్థలాన్ని అప్పగించారు. దీంతో చెత్త, వ్యర్థాలను తీసుకుని మున్సిపాలిటీ ట్రాక్టర్లు, ఈ-ఆటోలు డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలానికి వెళ్లాయి. ఎప్పటికైనా ఆ స్థలాన్ని కబ్జా చేయొచ్చన్న ఉద్దేశ్యంతో ఉన్న ఆ వైసీపీ నేతలు.. డంపింగ్ యార్డుకు స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకునేందుకు.. మరోవైపు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఇసకపాలెం గ్రామస్తులను ఉసిగొల్పినట్లు విమర్శలున్నాయి. ఈ క్రమంలో డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలం వద్దకు వచ్చిన వాహనాలను ఇసకపాలెం గ్రామస్తులు అడ్టుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచీ ఈ వివాదం కొనసాగుతోంది. అధికారులు సర్దిచెబుతున్నా ఆందోళనకారులు వినడం లేదు. ఈ ఆందోళనకు కొణ్ణంబట్టు పంచాయతీ పరిధిలోని గ్రామాలవారు మాత్రం రాలేదు. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపుతూ జిల్లా అధికారులు డంపింగ్ యార్డు స్థలాన్ని కేటాయిస్తే.. కొందరు సమస్యను మళ్లీ జటిలం చేస్తున్నారు. ఈ సమస్యలను మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే విజయశ్రీ దృష్టికి తీసుకెళ్లారు.