Share News

కుప్పానికి కుంకీలు

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:38 AM

నడిమూరు అటవీ నర్సరీలో క్యాంప్‌

కుప్పానికి కుంకీలు
కుంకీ ఏనుగుతో సబ్‌ డీఎఫ్‌వో వేణుగోపాల్‌, ఎఫ్‌ఆర్వో జయశంకర్‌ తదితరులు

కుప్పం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కుంకీ ఏనుగులు జయంత్‌, వినాయక్‌ సుదీర్ఘకాలం తర్వాత సొంత అడవికి చేరుకున్నాయి. కుప్పం మండలం నడిమూరు అటవీ శాఖ నర్సరీలో క్యాంప్‌ చేశాయి. ఇటీవల కుప్పం మండలంలో ఒంటరి ఏనుగు దాడిలో ఒక రైతు మృతి చెందడంతో పాటు రామకుప్పం మండలంలో రెండు ఏనుగుల సంచరిస్తున్న నేపథ్యంలో కుంకీ ఏనుగులను పలమనేరు శిక్షణ కేంద్రంనుంచి సోమవారం వాటి సొంత గూడు అయిన కుప్పం తీసుకువచ్చేశారు.

కుప్పం మండలం ఉర్లవోబనపల్లె పంచాయతీ కూర్మానపల్లెలో ఈనెల 12వ తేదీ రాత్రి కిట్టప్ప (70) అనే రైతు ఒంటరి ఏనుగు దాడిలో మృతి చెందాడు. మరోవైపు రామకుప్పం మండలం ననియాల అటవీ ప్రాంతంలో రెండు ఏనుగుల సంచారం రెండుమూడు రోజులుగా మొదలైంది.ఆదివారం రాత్రి ఈ ఏనుగులు వరి పొలాల్లోకి చొరబడి తీవ్రంగా పంట నష్టం కలిగించాయి. అదేరోజు రాత్రి నడిమూరు ప్రాంత అడవుల్లోకి చొరబడే అవకాశం ఉండడంతో అటవీ శాఖాధికారులు సమీప గ్రామాల్లో దండోరా వేయించారు.ఏనుగులు సంచరిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఇంకోపక్క కుప్పం అటవీ ప్రాంతంలో అదనంగా 5 ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ సిబ్బందితోపాటు స్థానిక ప్రజలు చెబుతున్నారు. దీంతో కుప్పం నియోజకవర్గ అటవీ సమీప గ్రామాలు ఏనుగుల దాడుల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పలమనేరు శిక్షణ కేంద్రంలో ఉన్న కుంకీ ఏనుగులు జయంత్‌, వినాయక్‌లను అధికారులు సోమవారం నడిమూరులోని అటవీ శాఖ నర్సరీలోకి తరలించారు. సబ్‌ డీఎఫ్‌వో వేణుగోపాల్‌, ఎఫ్‌ఆర్‌వో జయశంకర్‌, డీఆర్వో సమీర్‌ బాషా తదితరులు వాటిని దగ్గరుండి ఇక్కడకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా అటవీ శాఖాధికారులు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఒంటరి ఏనుగు సంచారం నేపథ్యంలో నడిమూరు క్యాంపునకు కుంకీ ఏనుగులను తరలించినట్లు చెప్పారు. ఇకమీదట కుంకీ ఏనుగుల ద్వారా ఒంటరి ఏనుగుతోపాటు, రామకుప్పం మండలం ననియాల పరిధిలో సంచరిస్తున్న ఏనుగులను కూడా తరిమేస్తామన్నారు. ప్రస్తుతానికైతే కుంకీ ఏనుగును కుప్పం అటవీ ప్రాంతంనుంచి తమిళనాడు అటవీ సరిహద్దు ప్రాంతమైన కుంగుర్తికి మళ్లించామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్‌ డీఎఫ్‌వో వేణుగోపాల్‌ సూచించారు.

Updated Date - Nov 18 , 2025 | 12:38 AM