కృష్ణా జలాలతో నిండుతున్న పరమసముద్రం
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:37 AM
కుప్పం పురపాలక సంఘ పరిధిలోని పరమసముద్రం చెరువు కృష్ణా జలాలతో నిండుతోంది. హంద్రీ-నీవా కాలువకు కడప జిల్లా నంద్యాల వద్ద ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రవాహం అప్రతిహతంగా సాగి ఈనెల 23వ తేదీ అర్థరాత్రి రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించింది. శాంతిపురం, గుడుపల్లె మండలాల మీదుగా ప్రవహిస్తూ 25వ తేదీ సాయంత్రానికి జరుగు పంచాయతీ సమీపంలో హంద్రీ నీవా కాలువ ద్వారా కుప్పం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి.
కుప్పం, ఆగస్టు 26 (ఆంరఽధజ్యోతి): కుప్పం పురపాలక సంఘ పరిధిలోని పరమసముద్రం చెరువు కృష్ణా జలాలతో నిండుతోంది. హంద్రీ-నీవా కాలువకు కడప జిల్లా నంద్యాల వద్ద ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రవాహం అప్రతిహతంగా సాగి ఈనెల 23వ తేదీ అర్థరాత్రి రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించింది. శాంతిపురం, గుడుపల్లె మండలాల మీదుగా ప్రవహిస్తూ 25వ తేదీ సాయంత్రానికి జరుగు పంచాయతీ సమీపంలో హంద్రీ నీవా కాలువ ద్వారా కుప్పం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. అదే రోజు రాత్రి సుమారు 8 గంటలనుంచీ హంద్రీ-నీవా కాలువ ఆఖరి మజిలీ అయిన పరమసముద్రం చెరువుకు చేరడం ప్రారంభించాయి. రాత్రి మొత్తం ప్రవహించిన కృష్ణా జలాలతో మంగళవారం సాయంత్రానికి పరమసముద్రం చెరువు సుమారు సగభాగం నిండింది. దీంతో స్థానిక ప్రజలు మంగళవారం పెద్దయెత్తున చెరువు వద్దకు చేరుకుని గంగమ్మకు జలహారతి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే తీరున, ఇదే వేగంతో కృష్ణా జలాలు ప్రవహిస్తే పరమసముద్రం చెరువే కాక, దాని కింద ఉన్న నియోజకవర్గంలోని సగానికి పైగా చెరువులు నిండే అవకాశం ఉంది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు హంద్రీ-నీవా కాలువ ద్వారా నింపడం ప్రాజెక్టులో భాగమైన విషయం తెలిసిందే. అయితే ఆయా చెరువులకు సప్లయ్ ఛానళ్లను మరమ్మతు చేసే పని మిగిలి ఉండడంతోపాటు హంద్రీ-నీవా కాలువ మధ్యలో అక్కడక్కడా తీయకుండా వదిలేసిన కాంక్రీటు గుట్టలు, పొదలు వంటివి అడ్డంకిగా ఉంటున్నాయి. ఈ అడ్డంకులను తొలగించి సప్లయ్ ఛానళ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తే హంద్రీ-నీవా కాలువ ద్వారా నిర్దేశిత చెరువులు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇదే జరిగితే కుప్పం, పలమనేరు నియోజకవర్గంలోని 6300 ఎకరాల ఆయకట్టు నేరుగా సాగులోకి వస్తుంది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో 514.36 ఎకరాలు, శాంతిపురం మండలంలో 110.17, కుప్పం మండలంలో 1274, గుడుపల్లె మండలంలో 796 ఎకరాలకు నేరుగా సాగునీటి వసతి లభిస్తుంది.అలాగే పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలంలో 881.25 ఎకరాలు, గంగవరం మండలంలో 243.20, బైరెడ్డిపల్లె మండలంలో 529.11, వి.కోట మండలంలో 951.24 ఎకరాలకు కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తాయి. పరోక్షంగా మరికొన్ని చెరువులకు నీటి వసతి లభించి తద్వారా మరికొన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది.