కళత్తూరును వీడని బురద
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:44 AM
కేవీబీపురం మండలం కళత్తూరు దళితవాడలో ఇంకా బురద తొలగలేదు. గురువారం ఓళ్లూరు రాయలచెరువు తెగడంతో వచ్చిన నీటి ప్రవాహంతో ఊరంతా బురదమయంగా మారింది. శనివారం ఉదయం నుంచీ డీపీవో సుశీలాదేవి ఆధ్వర్యంలో సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ఇళ్లలో పేరుకుపోయిన బురద తీయడానికి ప్రత్యేక కార్మికులను ఏర్పాటు చేశారు. వీధుల్లో బురదను ట్రాక్టర్ల ద్వారా తొలగించి శుభ్ర పరిచారు.
కేవీబీపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేవీబీపురం మండలం కళత్తూరు దళితవాడలో ఇంకా బురద తొలగలేదు. గురువారం ఓళ్లూరు రాయలచెరువు తెగడంతో వచ్చిన నీటి ప్రవాహంతో ఊరంతా బురదమయంగా మారింది. శనివారం ఉదయం నుంచీ డీపీవో సుశీలాదేవి ఆధ్వర్యంలో సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ఇళ్లలో పేరుకుపోయిన బురద తీయడానికి ప్రత్యేక కార్మికులను ఏర్పాటు చేశారు. వీధుల్లో బురదను ట్రాక్టర్ల ద్వారా తొలగించి శుభ్ర పరిచారు. డిస్కం ఏఈ మునికుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు, సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు. 133 పశువులకువైద్యాధికారి పార్ధీబన్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ వేశారు. వైద్యాధికారి రామనాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటికి రోగ నివారణ మందులను పంపిణీ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తహసీల్దారు రోశయ్య ఆధ్వర్యంలో పాతపాళెం అరుంధతివాడలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
బురదలోనే వాహనాలు
కళత్తూరు దళితవాడలో సుమారు 20 ట్రాక్టర్లు కొట్టుకుపోయి చెరువు, పొలాల్లో పడ్డాయి. సుమారు 150 ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఇవన్నీ బురదలో కూరుకుపోయి పనికిరాకుండా పోయాయి.
ఈ పొలంలో సాగు చేసేదెట్టా?
రాళ్లు తేలిపోయి, మట్టి కొట్టుకుపోయి, ఇసుక మేట వేసిన ఈ పొలం పాతపాళేనికి చెందిన డిల్లీబాబుది. పొలం ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇంకా ఆదెమ్మ రెండు ఎకరాల చెరకు పంట దెబ్బతిని మట్టి, ఇసుక పొలంలో మేట వేసింది. చంద్రారెడ్డి బావి, పొలం మేట వేసి మట్టి చేరిపోయింది. ఆ పొలాల్లో సాగు చేయాలంటే ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. సుమారు 800 ఎకరాల వరకు మేట వేసి పొలాలు మొత్తం పనికిరాకుండాపోయాయి.
వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు
ఓళూరు చెరువు తెగి ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారని సదరన్ డిస్కం సీఎండీ శివశంకర్ శనివారం చెప్పారు. ‘కేవీబీ పురంలోని 33-11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మునగడంతో కళత్తూరు, ఎస్‌ఎల్‌పురం, పిసీకెపురం, రంగయ్యగుంట, రాజులకండ్రిగ, కొటాలమిట్ట తదితర గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 223 విద్యుత్ స్తంభాలు, 78 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో 2093 (వ్యవసాయ, గృహ, తాగునీటి) సర్వీసులకు సరఫరా ఆగింది. శుక్రవారం రాత్రికి 89 స్తంభాలు, 78 ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించి 1353 విద్యుత్ సర్వీసులకు సరఫరా ఇచ్చాం. మిగిలిన సర్వీసులకు శనివారం పూర్తి చేశాం. దీనికోసం రెండు రోజులు శ్రమించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు’ అని శివశంకర్ పేర్కొన్నారు.