కదిలొచ్చిన పోలేరమ్మ
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:37 AM
పుట్టిల్లయిన కుమ్మరి ఇంట బుధవారం రాత్రి రూపుదిద్దుకున్న పోలేరమ్మ ఊరేగింపుగా కదిలొచ్చారు. జాతర సందర్భంగా గురువారం భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఆలయం వద్ద కొలువుదీరనున్నారు. వెంకటగిరి జాతరలో భాగంగా బుధవారం పోలేరమ్మ పుట్టినింట అమ్మవారి పీఠానికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా అమ్మవారి ఉత్సవ ఊరేగింపు
భక్తుల దర్శనార్థం ఆలయం వద్ద నిలుపుదల
నేటి వెంకటగిరి జాతరకు సర్వం సిద్ధం
వెంకటగిరి/వెంకటగిరిటౌన్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): పుట్టిల్లయిన కుమ్మరి ఇంట బుధవారం రాత్రి రూపుదిద్దుకున్న పోలేరమ్మ ఊరేగింపుగా కదిలొచ్చారు. జాతర సందర్భంగా గురువారం భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఆలయం వద్ద కొలువుదీరనున్నారు. వెంకటగిరి జాతరలో భాగంగా బుధవారం పోలేరమ్మ పుట్టినింట అమ్మవారి పీఠానికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు పీఠంపై అమ్మవారి ప్రతిమను (కళ్లు, దిష్టి చుక్క లేకుండా) తయారు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పుట్టినింట కొలువుదీరిన అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో వేగంగా కదలాలంటూ పోలీసులు నెట్టగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అర్ధరాత్రి 12గంటలకు సప్పరంపై అమ్మవారిని అధిష్ఠింపచేసి అత్తవారిల్లుగా భావించే జీనిగలవారి వీధిలోని చాకలింటకు తీసుకొచ్చారు. ఇక్కడ ఆచార సంప్రదాయాలతో అమ్మవారికి కళ్లు, దిష్టి చుక్క ఏర్పాటు చేసి పూర్తి అలంకారం చేశారు. అక్కడ్నుంచి దివిటీల వెలుగుల్లో ఆసాదుల తప్పెట్లు, యువత చిందులు, కేరింతల నడుమ అమ్మవారి ఊరేగింపు మొదలైంది. ప్రతి ఇంటి ముంగిట అమ్మవారికి కోళ్లు, మేకలను బలిచ్చారు. దీంతో పట్టణంలోని రోడ్లు ఎర్రగా మారాయి. అలా.. ఊరేగింపుగా అమ్మవారం గురువారం తెల్లవారుజామునకు ఆలయం వద్ద వేప మండలతో వేసిన మండపంలో కొలువుదీరనున్నారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా భక్తులు వేయి కళ్ల దుత్తలతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాత ట్రాక్టర్‌పై అమ్మవారిని ఊరేగింపుగా విరూప మండపానికి తీసుకెళ్లి ప్రతిమను ముక్కలు ముక్కలుగా చేయడంతో వెంకటగిరి జాతర ముగియనుంది.
జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పుట్టింటి వద్ద.. జీనిగలవారి వీధిలోని అత్త వారింటి.. అమ్మవారి దేవస్థానం వద్ద పోలేమరమ్మను భక్తులు దర్శించుకొనేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యవేక్షించారు. ఇక, బందోబస్తు ఏర్పాట్లను బుధవారం ఎస్పీ హర్షవర్ధనరాజు పరిశీలించారు. 8 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 110మంది ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుల్, ప్రత్యేక దళాలు.. మొత్తంగా వెయ్యి మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, పోలీసు సిబ్బందికి వెంకటగిరి సీఐ రమణ విధులను అప్పగించారు.
చిన్నారుల మడి భిక్షాలు
‘పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి. పోతురాజుకు టెంకాయ్ కొట్టండి. పగలక పోతే మానెత్తిన కొట్టండి’ అంటూ చిన్నా పెద్ద, పేద, ధనిక అన్న తేడా లేకుండా వేపమండలు, పసుపు, కుంకుమలతో అలంకరించిన వెదురు బుట్టలు, స్టీలు గిన్నెలను చేత బట్టి ఇల్లిలూ తిరుగుతూ మొక్కుగా భిక్షాటన చేశారు. ఆ భిక్షాటన ద్వారా వచ్చే బియ్యంతో కుడుములు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు.