Share News

సినిమా పిచ్చే దొంగను చేసింది!

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:42 AM

బంగారు దుకాణంలో చోరీ కేసులో నిందితుడి అరెస్టు మూడు రాష్ట్రాల్లో 23 కేసులు నమోదైనట్లు గుర్తింపు

సినిమా పిచ్చే దొంగను చేసింది!
మీడియాకు వివరాలు తెలియజేస్తున్న ఏఎస్పీ రాజశేఖర్‌రాజు

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): చిన్నప్పుడే చిల్లర దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడి శిక్షను అనుభవించాడు. బయటికి వచ్చాక ఆస్తులను అమ్మి, అప్పులు చేసి కీచకుడు అనే సినిమా తీశాడు. అది రిలీజ్‌ కాలేదు. తన పేరుతోనే ఆనంద్‌ రిటర్న్స్‌ అనే షార్ట్‌ ఫిలిమ్‌ తీయాలనుకున్నా డబ్బులు చాలలేదు. ఈ సినిమా పిచ్చితోనే దొంగతనాలకు పాల్పడి చివరకు జైలుపాలైన అంతర్రాష్ట్ర దొంగ ఉదంతం ఇది. ఆ వివరాలను డీఎస్పీ సాయినాథ్‌, సీఐలు నెట్టికంఠయ్య, మహేశ్వరలతో కలిసి ఏఎస్పీ రాజశేఖర్‌రాజు ఆదివారం చిత్తూరు పోలీసు అతిథి గృహంలో మీడియాకు వివరించారు. ఈనెల 4న చిత్తూరు నగరంలోని జెండామానువీధి శరవణ బంగారు దుకాణంలో సుమారు 131.5 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లినట్లు యజమాని శరవణ ఆచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ మణికంఠ ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలు పది రోజులుగా తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో విచారణ ప్రారంభించాయి. సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతికతను వినియోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం బెంగళూరు-చెన్నై బైపాస్‌ రోడ్డులోని శృతి మిల్క్‌ డెయిరీ ఎదురుగా కర్ణాటక రాష్ట్రం ఎంఆర్‌ఎస్‌ పాళ్యం నంది దుర్గా రోడ్డుకు చెందిన ఆనంద్‌(39)ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బంగారం దుకాణంలో చోరీ చేసిందని తానేనని ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.12లక్షల విలువైన 131.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల విలువైన వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన రూ.2 లక్షల విలువైన కారుతో కలిపి మొత్తం రూ.17లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సినిమా అంటే తనకు పిచ్చి అని తెలిపాడు. ఈ క్రమంలో ఓ సినిమా తీయడంతో అప్పులపాలయ్యాయనని, తీర్చడానికి షార్ట్‌ ఫిలిమ్‌ తీద్దామంటే డబ్బులు లేకపోవడంతోనే దొంగతనాలకు పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇతడిపై ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 23 కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసును ఛేదించడానికి కృషిచేసిన పోలీసులకు నగదు బహుమతులను అందించారు. జిల్లాలో ఇప్పటికే 3,300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, మిగిలిన చోట్ల కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఏఎస్పీ చెప్పారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, దుకాణదారులు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు.

Updated Date - Jun 16 , 2025 | 12:42 AM