మాతంగుల హంగామా
ABN , Publish Date - May 12 , 2025 | 01:40 AM
తలకు పసుపుగుడ్డను జడలా కట్టి, కొప్పిముడి వేసుకుని మల్లిపూలు చుట్టుకున్నారు. శరీరమంతా గంధం పూసుకుని చీర, రవిక ధరించారు. మెడలో పూలహారం వేసుకున్నారు. ముఖానికి ఎర్రని బొట్టుపెట్టుకున్నారు. ఇలా.. తిరుపతి గంగజాతరలో ఆదివారం మాతంగి వేషధారణతో భక్తులు హంగామా చేశారు. పలకలు వాయిస్తూ, కొమ్ములు ఊదుతూ ఉంటే మాతంగి వేషగాళ్లు లయబద్దంగా చిందులు వేసుకుంటూ వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
గంగజాతరకు పెరిగిన సందడి
తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): తలకు పసుపుగుడ్డను జడలా కట్టి, కొప్పిముడి వేసుకుని మల్లిపూలు చుట్టుకున్నారు. శరీరమంతా గంధం పూసుకుని చీర, రవిక ధరించారు. మెడలో పూలహారం వేసుకున్నారు. ముఖానికి ఎర్రని బొట్టుపెట్టుకున్నారు. ఇలా.. తిరుపతి గంగజాతరలో ఆదివారం మాతంగి వేషధారణతో భక్తులు హంగామా చేశారు. పలకలు వాయిస్తూ, కొమ్ములు ఊదుతూ ఉంటే మాతంగి వేషగాళ్లు లయబద్దంగా చిందులు వేసుకుంటూ వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. మరోవైపు తిరుపతి గంగజాతరలో సందడి పెరిగింది. భక్తుల వేషాలు ఊపందుకున్నాయి. మాతంగి వేషంలో మగరాయుళ్లు గంగమ్మకు భక్తితో ప్రణమిల్లారు. వేశాలమ్మ, తాళ్లపాక పెదగంగమ్మ, అంకాళమ్మ తదితర ఆలయాల్లోనూ జాతర సందడి కనిపించింది. తాతయ్యగుంట గంగమ్మకు అధికార, అనధికార ప్రముఖులు ఆలయానికి వచ్చి సారెలు అందజేశారు
నేడు సున్నపు కుండలు: మహిళలపై అత్యాచారం చేస్తున్న పాలేగాడిని గంగమ్మ సంహరించాక తిరుపతికి మేమున్నాం...అంటూ పెదగంగమ్మ, చినగంగమ్మ సున్నపు కుండలు కట్టుకుని అంతటా తిరిగి పూజలందుకుంటారు. పాలేగాళ్ల బాధ ఉండదంటూ భరోసా ఇస్తారు. అప్పటి నుంచి తిరుపతి జాతరలో గంగమ్మ వంశస్థులైన కైకాల కులస్థులు ఈ సున్నపు కుండల వేషాలను ధరించడం ఆచారంగా వస్తోంది. ఇలా సోమవారం సున్నపుకుండల వేషంలో ఉన్న ఇద్దరు కైకాల కులస్తులు పూజలందుకుంటారు. భక్తులు వివిధ వేషాలతో అమ్మవార్లను దర్శించుకుంటారు.
రేపటి జాతరకు 320 మందితో భద్రత
తిరుపతి(నేరవిభాగం): తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం జరగనుంది. డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో 320 మంది పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, 240 మంది ఏఎ్‌సఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసులు, హోంగార్డులు బందోబస్తు విధుల్లో ఉంటారు. ఆలయంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి అనుమతించనున్నారు. క్యూలలో తొక్కిసలాట, తోపులాట జరగకుండా మూడు విభాగాలుగా విభజించారు. అనుమానితులు, పాత నేరస్థులు, చైన్ స్నాచర్లు, జేబు దొంగలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే 26 సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు చేశారు.