Share News

తప్పిన దిత్వా ముప్పు!

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:55 AM

జిల్లాకు ‘దిత్వా’ ముప్పు తప్పింది. తుఫాను బలహీన పడినా.. దాని ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రాత్రి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు తూర్పు 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

తప్పిన దిత్వా ముప్పు!
బీఎన్‌కండ్రిగ మండలం నెరిణికండ్రిగ వద్ద నీట మునిగిన వరి

బలహీనపడిన తుఫాను

మరో రెండు రోజులు వర్ష సూచన

సూళ్లూరుపేట/తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ‘దిత్వా’ ముప్పు తప్పింది. తుఫాను బలహీన పడినా.. దాని ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రాత్రి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు తూర్పు 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అర్ధరాత్రికి వాయుగుండం బలపడే అవకాశంఉంది. దీంతో మంగళవారం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలియజేసింది. మరోవైపు సోమవారం తెల్లవారు జాము నుంచి జడివాన కురుస్తోంది. తేలికపాటి వర్షాలు కావడంతో ఇప్పటి వరకు ఆస్తి, పంట నష్టాలు సంభవించలేదు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడులో నాలుగు పూడిగుడిసెలు నేలకూలాయి. నాయుడుపేట-వెంకటగిరి మార్గంలో స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహానికి ఒకరు కొట్టుకుపోతుండగా పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. ఇక, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక, కోట మండలం శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం, యమదిన్నెపాళెం ప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడుతూ సముద్రం కొన్ని మీటర్లు ముందుకువచ్చింది.

వర్షపాతం: మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు సత్యవేడులో 38.2 మి.మీ., తడలో 37.4, వరదయ్యపాళెంలో 35.8, బీఎన్‌కడ్రిగలో 30.4, సూళ్ళూరుపేటలో 24, ఓజిలిలో 20.8, పెళ్లకూరులో 20.4, కేవీబీపురంలో 18.6మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 11 మండలాల్లో చినుకులు తప్ప పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు.

కాళంగిలో రెండు గేట్లు ఎత్తివేత

కేవీబీపురం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కేవీబీపురం మండలంలోని కాళంగి జలాశయం నీటిమట్టం 18.6 అడుగులకు చేరుకుంది. దీంతో సోమవారం రెండు గేట్లను రెండు అడుగుల చొప్పున ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు ఆయకట్టు అధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు.

మల్లిమడుగులో 9 గేట్ల ఎత్తివేత

రేణిగుంట, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రేణిగుంట మండలంలోని మల్లిమడుగు డ్యాంకు 2100 క్యూసెక్కుల నీళ్లు వస్తోంది. దీంతో సోమవారం ఉదయం 9 గేట్లను ఒక అడుగు పైకి ఎత్తి 2400 క్యూసెక్కుల నీటిని వదులుతున్న డీఈ చంద్రమౌళి తెలిపారు.

Updated Date - Dec 02 , 2025 | 01:55 AM