తప్పిన ‘మొంథా’ ముప్పు!
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:55 PM
ఏర్పేడు, పెళ్ళకూరు మండలాల్లో పూరి గుడిసెలు కూలిపోగా రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి
తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మొంథా తుఫాను ముప్పు తప్పింది. అయితే దాని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచీ మంగళవారం సాయంత్రం వరకూ ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి వర్షాలు కావడంతో జిల్లాలో పెద్దగా ఆస్తి, పంట నష్టాలు సంభవించలేదు.
ఏర్పేడు, పెళ్ళకూరు మండలాల్లో పూరి గుడిసెలు కూలిపోగా రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, ఏర్పేడు తదితర చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్ళలోకి వర్షపు నీరు ప్రవేశించింది. లోతట్టు ప్రాంతాలకు చెందిన గిరిజన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చెరువులు, రిజర్వాయర్లలోకి నీరు చేరుతోంది. కాగా వరద నీటి ప్రవాహాలు కాజ్‌వేల పైకి రావడం, వర్షాలకు రోడ్లు దెబ్బ తినడం వంటి కారణాలతో జిల్లావ్యాప్తంగా పలు మార్గాల్లో 19 ఆర్టీసీ సర్వీసులు రద్దయ్యాయి. అలాగే తిరుపతి- విశాఖ నడుమ తిరిగే రెండు రైళ్ళు సైతం రద్దయ్యాయి.
జిల్లాలో ఆగని వర్షం
జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారమంతా ఒక మోస్తరు వర్షం పడుతూనే ఉంది. దీనికి ఈదురుగాలులు తోడవడంతో చలితీవ్రత పెరిగింది. తిరుమలలో భక్తులు చలికి వణికిపోయారు. తిరుపతి రుయాస్పత్రిలోనూ రోగులకు అవస్థలు తప్పలేదు.
11 మండలాలకు భారీ వర్ష హెచ్చరిక
తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచీ బుధవారం వరకు 11 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. సముద్ర తీర మండలాలు, తీరానికి చేరువగా ఉన్న మండలాలైన గూడూరు, వాకాడు, కోట, చిల్లకూరు, చిట్టమూరు, ఓజిలి, దొరవారిసత్రం, సూళ్ళూరుపేట, తడ, సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. దానికి తగ్గట్టుగానే మంగళవారం మధ్యాహ్నం నుంచే జిల్లావ్యాప్తంగా గాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా సముద్ర తీరానికి చేరువలో వున్న మండలాల్లో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ప్రత్యేకాధికారి అరుణ్‌బాబు మంగళవారం వాకాడు, చిల్లకూరు మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించారు.