Share News

ఒంటరి ఏనుగు హల్‌చల్‌

ABN , Publish Date - Jun 27 , 2025 | 01:03 AM

రామకుప్పం మండల అటవీప్రాంత జనానికి మూడ్రోజులుగా ఒంటరి ఏనుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని నెలలుగా ననియాల అటవీ లోతట్టు ప్రాంతంలో మకాం వేసిన ఈ ఏనుగు.. తోటలు, పొలాలపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది.

ఒంటరి ఏనుగు హల్‌చల్‌
పాక్షికంగా ధ్వంసమైన షెడ్‌ గోడ

రామకుప్పం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండల అటవీప్రాంత జనానికి మూడ్రోజులుగా ఒంటరి ఏనుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని నెలలుగా ననియాల అటవీ లోతట్టు ప్రాంతంలో మకాం వేసిన ఈ ఏనుగు.. తోటలు, పొలాలపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది. గిట్టుబాటు ధరలేక మామిడి కాయలను చెట్లలోనే వదిలేస్తున్నారు. మాగిన కాయలు నేలరాలిపోతున్నాయి. ఈ పండ్ల వాసన పసిగట్టిన ఒంటరి ఏనుగు.. ననియాల, ఎస్‌.గొల్లపల్లె తదితర గ్రామాల సమీప తోటలు, పొలాలపై పడుతోంది. నేలరాలిన పండ్లను తింటూ, కాయల్ని నేలరాలుస్తోంది. కొమ్మలు విరిచేస్తోంది. ననియాలకు చెందిన చంద్రమోహన్‌ దంపతులు తమ పొలంలోని టమోటాలను కోసి సోమవారం రాత్రి అక్కడే ఉన్న షెడ్‌లో ఉంచి.. కాపలా ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఒంటరి ఏనుగు వీరి పొలం వద్దకొచ్చింది. ఆ సమయంలో బహిర్భూమికని షెడ్‌ బయటకు వచ్చిన చంద్రమోహన్‌ భార్యను చూసి.. ఆమెవైపు వచ్చింది. దూరంనుంచే గమనించిన ఆమె పరుగున గ్రామానికి చేరుకుంది. షెడ్‌లోని చంద్రమోహన్‌ మాత్రం భయాందోళనతో అక్కడే నక్కి ఉండిపోయాడు. షెడ్‌ గోడను పాక్షికంగా కూల్చివేసిన ఏనుగు అక్కడినుంచి వెళ్లిపోవడంతో ఆయన తప్పించుకున్నాడు. బుధవారం రాత్రి తిరిగి గ్రామ సమీప పొలాలు, తోటలపై దాడి చేసింది. శంకరప్ప, నాగరాజు, బెంగుళూరుప్పకు చెందిన మామిడి తోటలు, వరి పొలాలపై పడింది. మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. వరి పైరునూ తొక్కేసింది. ఈ ఏనుగును అటవీ లోతట్టు ప్రాంతం వైపు మళ్లించడానికి అటవీ అధికారులు, ట్రాకర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒక్కోసారి వారిపై తిరగబడుతోంది. బాణసంచా పేల్చినా జంకడం లేదని ననియాల అటవీ విభాగాధికారి హరికుమార్‌ తెలిపారు. ఏనుగును రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని రైతులకు సూచించారు. రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని ఆయన చెప్పారు.

Updated Date - Jun 27 , 2025 | 01:03 AM