గూడూరుపై తొలగని అస్పష్టత
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:34 AM
ఇంతకీ గూడూరు జిల్లా అవుతుందా.. లేక నెల్లూరు జిల్లాలో కలుస్తుందా? వెంకటగిరి ఎటు ఉంటుంది? నగరి నియోజకవర్గం మొత్తం అటా.. ఇటా?
వెంకటగిరి మండలాలను ఎటు కలుపుతారు?
నగరి మొత్తం తిరుపతిలోకేనా?
జిల్లాల పునర్విభజనపై అదే అనిశ్చితి
ఇంతకీ గూడూరు జిల్లా అవుతుందా.. లేక నెల్లూరు జిల్లాలో కలుస్తుందా? వెంకటగిరి ఎటు ఉంటుంది? నగరి నియోజకవర్గం మొత్తం అటా.. ఇటా?
ఈ ప్రశ్నలకు బుధవారం జరిగిన మంత్రివర్గం ఉపసంఘం సమావేశంలోనూ సమాధానాలు లభించలేదు. అస్పష్టత యధాతధంగా కొనసాగుతోంది. ప్రజల ఆకాంక్షలు, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు సహా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఏమవుతాయనే సందేహాలు మిగిలిపోయాయి.
గూడూరు నెల్లూరు జిల్లాలోకి
గూడూరు నియోజకవర్గాన్ని అక్కడి ప్రజల కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని గతేడాది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందే యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సైతం గూడూరు ప్రజలకు అదే విధమైన వాగ్ధానం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రస్తుత మంత్రివర్గ ఉపసంఘం కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపేందుకు సానుకూలంగా ప్రతిపాదించే అవకాశముంది. అయితే అక్కడ ఇటీవల వినిపిస్తున్న గూడూరు జిల్లా ఏర్పాటు మాత్రం లేనట్టే భావించాలి.
వెంకటగిరి ఎటు?
వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలుండగా వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు తిరుపతి జిల్లాలో కలిపిన గత ప్రభుత్వం మిగిలిన కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విభజన పరిపాలనా పరంగా అసౌకర్యం కలిగిస్తున్న నేపధ్యంలో నియోజకవర్గాన్ని పూర్తిగా అటు నెల్లూరులోనో లేక ఇటు తిరుపతి జిల్లాలోనో కలపాల్సిన అవసరం ఏర్పడింది. వెంకటగిరి నుంచీ నెల్లూరుకు 82 కిలోమీటర్ల దూరం కాగా తిరుపతికి 50 కిలోమీటర్లు. ఈ విషయంలోనూ మంత్రివర్గ ఉపసంఘం ఓ నిర్ణయానికి రాలేదు.
నగరి మొత్తం తిరుపతిలోకే!
నగరి నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం రెండు జిల్లాల నడుమ విభజించి అసౌకర్యానికి, అయోమయానికి కారణమైంది. నగరి, నిండ్ర, విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాలో కొనసాగించిన గత ప్రభుత్వం మిగిలిన పుత్తూరు, వడమాలపేట మండలాలను తిరుపతి జిల్లాలో కలిపింది. ఇది పాలనాపరమైన సమస్యలకు దారి తీసింది. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గం మొత్తాన్నీ తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు చిత్తూరు కలెక్టర్ సైతం నగరి, నిండ్ర, విజయపురం మండలాలను చిత్తూరు నుంచీ తొలగించి తిరుపతి జిల్లాలోనే కలపాలని సిఫారసు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని, చిత్తూరు కలెక్టర్ నివేదికను దృష్టిలో వుంచుకుని చూస్తే మంత్రివర్గ ఉపసంఘం నగరిని పూర్తిగా తిరుపతిలో కలిపే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదించాల్సి వుంది. కాకపోతే దీనిపైనా ఇప్పటి దాకా ఒక నిర్ణయం తీసుకోలేదు.
రెవెన్యూ డివిజన్లలో మార్పులు
గూడూరును నెల్లూరులో కలపడం తప్పనిసరి కానుంది కాబట్టి రెవిన్యూ డివిజన్ల పరంగా మార్పులు అనివార్యం కానున్నాయి. ఇప్పటి వరకూ వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు గూడూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో వున్నాయి. గూడూరు తిరిగి నెల్లూరులో విలీనమైతే వెంకటగిరికి చెందిన మూడు మండలాలను శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రతిపాదించారు. అలాగే నగరి నియోజకవర్గం పూర్తిగా తిరుపతిలో విలీనమైతే నగరి రెవిన్యూ డివిజన్ ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. గూడూరును కోల్పేయే పక్షంలో నగరి డివిజన్ ఆ లోటును భర్తీ చేయనుంది. మొత్తం మీద జిల్లాలోని నాలుగు డివిజన్ల సంఖ్య యధాతధంగా వుంటుంది.
నాయుడుపేట జిల్లా సాధ్యం కాదు
నాయుడుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి, మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు అందినట్టు సమాచారం. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం జిల్లా యంత్రాంగం అభిప్రాయాన్ని కోరిందని సమాచారం. అయితే నాయుడుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనగా పేర్కొంటూ జిల్లా యంత్రాంగం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
నగర పంచాయతీలుగా వరదయ్యపాలెం, సత్యవేడు
జిల్లాలో ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్‌తో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి తదితర ఆరు మున్సిపాలిటీలున్న సంగతి తెలిసిందే. వీటికి మరో రెండు మున్సిపాలిటీలు తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. సత్యవేడు, వరదయ్యపాలెం మండల కేంద్రాలను నగర పంచాయతీలుగా మార్చాలంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. శ్రీసిటీతో పాటు ఏపీఐఐసీకి చెందిన పలు పారిశ్రామిక పార్కులు వుండి, అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలున్న ప్రాంతం కావడంతో సత్యవేడు, వరదయ్యపాలెం మండల కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వీటిని పంచాయతీల నుంచీ నగర పంచాయతీలుగా స్థాయి పెంచాలని ప్రతిపాదించారు. సత్యవేడు పంచాయతీ ప్రస్తుత జనాభా 17 వేలు కాగా సమీపంలోని కాలమనాయుడు పేట, కొత్తమారికుప్పం, ఎన్‌ఆర్ అగ్రహారం, వీఆర్ కండ్రిగ తదితర పంచాయతీలను కలుపుకుంటే జనాభా సుమారు 30 వేలకు చేరుతుంది. వాటిని కలిపి నగర పంచాయతీగా మార్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వరదయ్యపాలెం మండల కేంద్రం ప్రస్తుత జనాభా 7 వేలకు పైగా వుంది. దాన్ని కూడా నగర పంచాయతీగా మార్చే అవకాశం కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో గూడూరు మున్సిపాలిటీని కోల్పోయినా నగరి మున్సిపాలిటీ జిల్లాకు చేరనుంది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి