హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:39 AM
జిల్లాలో సోమవారం నుంచి హెల్మెట్ తప్పనిసరి. 20 రోజులపాటు అవగాహన కల్పించిన పోలీసులు.. ఇక, క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం తిరుపతిలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు.
నేటి నుంచి తప్పనిసరి
లేకుంటే పెట్రోలు నింపరు.. కేసులు పెడతారు
హెల్మెట్ ఉంటేనే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ నింపండి. లేకుంటే పట్టకూడదు. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయండి.
- ఇదీ 20 రోజులుగా జిల్లాలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు పోలీసుల సూచన. ఆ మేరకు ఫ్లెక్సీలూ పెట్టారు.
హెల్మెట్ పెట్టుకోమన్నది మీ క్షేమం కోసమే. మీ కుటుంబం బాగుండాలనే. దీనిని శిక్షగా కాదు.. బాధ్యతగా తీసుకోండి. లేకుంటే కేసులు పెడతాం.
- ఇదీ అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలకు హెచ్చరికతో కూడిన సలహా.
జిల్లాలో సోమవారం నుంచి హెల్మెట్ తప్పనిసరి. 20 రోజులపాటు అవగాహన కల్పించిన పోలీసులు.. ఇక, క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం తిరుపతిలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు. ఎంతటి వారైనా ద్విచక్ర వాహనంలో వస్తే హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టంచేశారు. ‘తలకు హెల్మెట్ బరువు కాదు. ఇది కుటుంబం పెట్టుకున్న బాధ్యతగా భావించండి. రోడ్లపైకి వచ్చే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాలను మీ అమ్మ నాన్న ఆశల్ని, మీ భార్యా పిల్లల భవిష్యత్తును మీ తల మీద పెట్టుకుని కాపాడుకుంటారా? లేదా క్షణిక నిర్లక్ష్యంతో వదిలేస్తారా? మీ మనస్సును అడిగి చూడండి’ అంటూ ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. సోమవారం నుంచి ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి తీరాల్సిందేనని స్పష్టంచేశారు. లేకుంటే కేసులు నమోదు చేసి రవాణా శాఖకు వాహనాలను అప్పగిస్తామంటూ హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే అన్ని పెట్రోలు బంకుల నిర్వాహకులకు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి