Share News

కుప్పంలో హరియాణా గ్యాంగ్‌ హల్‌చల్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:28 AM

కుప్పంలో మంగళవారం రాత్రి హరియాణాకు చెందిన గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసుల నుంచి ఆలస్యంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

కుప్పంలో హరియాణా గ్యాంగ్‌ హల్‌చల్‌
కుప్పం అర్బన్‌ పోలీసు స్టేషన్‌

వాహనంతో ఎస్‌ఐను తొక్కించబోయారు

కాల్పులు జరిపిన సీఐ

సినీ ఫక్కీలో ఘటన

దుండగుల కోసం కొనసాగుతున్న గాలింపు

కుప్పం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో మంగళవారం రాత్రి హరియాణాకు చెందిన గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసుల నుంచి ఆలస్యంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మన జిల్లాలో అనేక నేరాలతో సంబంధం ఉన్న హరియాణాకు చెందిన అంతర్జాతీయ దోపిడీ దొంగల ముఠా కుప్పం వైపు వస్తున్నట్లు జిల్లా కేంద్రంలోని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా స్థానిక పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారమందింది. వెంటనే కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌, గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందితో కలిసి వెదకడానికి బయల్దేరారు. మార్గమధ్యంలోని వ్యవసాయ మార్కెట్టు యార్డు వద్దకొచ్చేసరికి కుప్పంవైపు వేగంగా వస్తున్న ఒక స్కార్పియో వాహనం వారికి ఎదురువచ్చింది. తమకున్న సమాచారంతో ఆ వాహనంలోనే హరియాణా గ్యాంగ్‌ ఉందని నిర్ధారించుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అందులోని దుండగులు ఏమాత్రం ఆగకుండా ఎస్‌ఐ మీదకే వాహనాన్ని తీసుకొచ్చి.. తొక్కించబోయారు. ప్రమాదాన్ని ఊహించిన కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ వెంటనే వాహనంలోని దుండగులపై ఓ రౌండ్‌ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయినా అతను వాహనాన్ని ఆపకుండా.. వెనక్కు మళ్లించి తిరుపత్తూరు మార్గంలోకి తిప్పాడు. ఆ వాహనాన్ని పోలీసులు మరో వాహనంలో వెంబడించారు. అతివేగంగా వెళ్లిన దుండగులు ప్రయాణించే వాహనం, ఇండిస్ట్రియల్‌ ఎస్టేట్‌ వద్ద ఒక గార్మెంట్‌ ఫ్యాక్టరీ సందులో మలుపు తిరిగి మాయమైంది. వెంటాడిన పోలీసులకు పరమసముద్రం చెరువు గట్టుమీద ఖాళీ వాహనం వాహనం కనిపించింది. అప్పటికే దుండుగులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనంలో డ్రైవర్‌తోసహా సుమారు ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌, అర్బన్‌ సీఐ శంకరయ్యలతోపాటు కుప్పం పోలీసు డివిజన్‌ సిబ్బంది మొత్తం మంగళవారం రాత్రినుంచే దుండగులకోసం గాలింపు మొదలుపెట్టారు. దుండగులు విడిచిపెట్టిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం నుంచి రెండు స్నిఫర్‌ డాగ్స్‌ను తెప్పించి వాటి ద్వారా గాలింపు జరిపారు. ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది.

జిల్లాలోని అనేక నేరాలతో సంబంధం

హరియాణా గ్యాంగ్‌కు జిల్లాలో జరిగిన అనేక నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా, ఇళ్ల దోపిడీలు, పశువుల దొంగతనాలు వంటి తీవ్రమైన నేరాల్లో వీళ్లు నిందితులని సమాచారం. హరియాణా నుంచి వచ్చిన గ్యాంగ్‌ పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మకాం వేసి మన జిల్లాలో నేరాలకు పాల్పడుతుందని తెలిసింది.

త్వరలోనే పట్టుకుంటాం: డీఎస్పీ

ఈ సంఘటనపై డీఎస్పీ పార్థసారథిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. హరియాణాకు సంబంధించిన దోపిడీదారుల ముఠా కుప్పం వైపు వస్తున్నట్లు చిత్తూరు నుంచి తమకు మంగళవారం రాత్రి సమాచారమందిందని చెప్పారు. కుప్పం వ్యవసాయ మార్కెట్టు సమీపంలో వాహనాన్ని గుర్తించి అడ్డుకోబోయిన పోలీసులపై వారు వాహనాన్ని నడపడానికి ప్రయత్నించారన్నారు. ఈ క్రమంలో కుప్పం రూరల్‌ సీఐ వారిపై కాల్పులు జరిపారని, అయినా దుండగులు పరారయ్యారని తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హరియాణా గ్యాంగ్‌ను త్వరలోనే పట్టుకుని, చట్టప్రకారం శిక్షిస్తామని డీఎస్పీ చెప్పారు.

Updated Date - Jun 05 , 2025 | 01:28 AM