శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:21 AM
జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవంతో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు అన్నారు. తిరుపతిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’గా మార్చడానికి కృషి
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడు
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవంతో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు అన్నారు. తిరుపతిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రాహుల్ కన్వెన్షన్ హాలులో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సుకు సంబంధించి భద్రతా పర్యవేక్షణలో బిజీగా గడిపారు. అనంతరం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పురోహితులు ఆశీర్వచనాలు అందచేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తమ సమస్యలపై నేరుగా సంబంధిత స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేస్తానన్నారు. విజుబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తిరుపతితో పాటు జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చడానికి పటిష్ఠ ప్రణాళికలను అమలు చేస్తామని సుబ్బరాయుడు చెప్పారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అనంతరం అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, వెంకట్రావు, నాగభూషణరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు.