Share News

‘పద్మావతి’చెంత ప్రథమ పౌరురాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:06 AM

ఏడుకొండల స్వామి దర్శనానికి దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల చేరుకున్న ఆమె.. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

‘పద్మావతి’చెంత ప్రథమ పౌరురాలు

ఏడుకొండల స్వామి దర్శనానికి దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల చేరుకున్న ఆమె.. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

- రేణిగుంట/తిరుచానూరు/తిరుమల, ఆంధ్రజ్యోతి

20ప్రెసిడెంట్‌1

రేణిగుంట విమానాశ్రయం

సాయంత్రం 4.05 గంటలు. ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడా నుంచి ప్రత్యేక విమానం రేణిగంట విమానాశ్రయం చేరుకుంది. విమానం నుంచి దిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ హరి జవహర్‌ లాల్‌, ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఐజీ రాజకుమారి, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.

20ప్రెసిడెంట్‌2

పద్మావతి అమ్మవారి ఆలయం

4.40 గంటలు: కుమార్తె, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి రాష్ట్రపతి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మహద్వారం వద్ద దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి అనిత, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అర్చకులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరిందర్‌నాథ్‌, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

20ప్రెసిడెంట్‌3

ఆలయంలో అరగంటకుపైగా

పద్మావతి ఆలయం వద్ద గ్రీన్‌ రూమ్‌లోకి వెళ్లిన రాష్ట్రపతి పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. 4.55 గంటలకు ఆలయంలోకి విచ్చేశారు. మొదట ధ్వజస్తంభానికి మొక్కారు. సన్నిధిలోని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. లడ్డూ ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని ఈవో బహూకరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె 5.26 గంటలకు తిరుమలకు బయలుదేరారు.

20ప్రెసిడెంట్‌4

తిరుమలలో రాష్ట్రపతి

సాయంత్రం 6.15 గంటలు: తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు హోంమంత్రి అనిత, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, భానుప్రకా్‌షరెడ్డి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రిసెప్షన్‌ అధికారులు వసతి, దర్శన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం క్షేత్రసంప్రదాయం ప్రకారం తొలుత వరాహస్వామిని.. ఆ తర్వాత వేంకటేశ్వరస్వామిని రాష్ట్రపది దర్శించుకుని తిరుగు ప్రయాణంకానున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 01:06 AM