సుపరిపాలనలో తొలి అడుగు
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:11 AM
‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట బుధవారం నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది.
నేటి నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
అన్ని నియోజకవర్గాల్లో ముగిసిన కసరత్తు
జనం బాట పట్టనున్న అధికార పార్టీ నేతలు
తిరుపతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట బుధవారం నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విదేశీ పర్యటనలో ఉన్నందున.. ఆ నియోజకవర్గం మినహా మిగిలిన అన్నిచోట్లా అధికార పార్టీ నేతలు జనం బాట పట్టి.. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించనున్నారు. సమస్యలనూ తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. పాడైన రోడ్లు బాగుపడడం, కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం, పెరిగిన సంక్షేమ పింఛను, తల్లికి వందనం, ఉచిత వంట గ్యాస్ వంటి పథకాల అమలు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ధైర్యంగా జనంలోకి వెళ్ళగలిగే వాతావరణం నెలకొని ఉండటంతో ఆ పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది.
తిరుపతి: సుందరయ్యనగర్‌లో మొదలు
తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పెద్ద కసరత్తే నడిచింది. పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మంగళవారం తిరుపతి చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఉదయం 8 గంటలకు 34వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్ నుంచీ జనంలోకి వెళ్ళనున్నారు. అనంతరం క్లస్టర్ల వారీగా ఆయా ప్రాంత నేతలు కార్యక్రమాన్ని చేపట్టేలా నిర్ణయించారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలతో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
చంద్రగిరి: మంగళం షిర్డీసాయి మందిరం నుంచి..
చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని షిర్డీ సాయి మందిరం నుంచీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే పులివర్తి నానీ పాల్గొననున్నారు. బుధవారం మొత్తం తిరుమల నగర్ పంచాయతీలోనే పర్యటించనున్నారు. వాస్తవానికి నెల రోజుల పాటే కార్యక్రమం చేపట్టేందుకు పార్టీ నిర్ణయించగా.. పులివర్తి నానీ మాత్రం నియోజకవర్గం మొత్తం పర్యటించేందుకు మూడు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
నగరి: పన్నూరులో ప్రారంభం
నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం పన్నూరు గ్రామంలో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇదివరకూ విజయపురం మండలంలోని కమ్మకండ్రిగ నుంచీ ఈ తరహా కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీగా పాటించేవారు. ఈ సారి సెంటిమెంట్‌కు భిన్నంగా పన్నూరును ఎంచుకున్నారు.
శ్రీకాళహస్తి: వీరభద్రస్వామి సన్నిధి నుంచీ..
శ్రీకాళహస్తి నియోజకవర్గానికొస్తే తొట్టంబేడు మండలం చిన్న సింగమాల పంచాయతీ వీరభద్రస్వామి సన్నిధి నుంచీ కార్యక్రమాన్ని శుభారంభం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అంకయ్య చౌదరి, ముఖ్యనేతలు పాల్గొంటున్నారు.
సూళ్ళూరుపేట: సెంటిమెంటుకు పెద్ద పీట
సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఓజిలి మండలం కురుగొండ్లలో ఉదయం 8 గంటలకు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈశాన్యం సెంటిమెంటుతో ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఇక్కడ్నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. అదే సెంటిమెంటుతో ఇప్పుడూ మొదలు పెడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులను అక్కడికి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం ఆహ్వానిస్తున్నారు.
గూడూరు: తిక్కవరంలో ఆరంభం
గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం తిక్కవరంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రోజూ రాత్రి 7 గంటల వరకూ పర్యటనలు కొనసాగించాలని, ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు.
సత్యవేడు: రాజగోపాలపురం నుంచీ
సత్యవేడు మండలం రాజగోపాలపురంలో సాయంత్రం 4 గంటలకు ఇంటింటికీ టీడీపీ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీపతి బాబు, పరిశీలకుడు చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగనుంది. మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.
వెంకటగిరి: ఒక రోజు ఆలస్యంగా..
విదేశీ పర్యటనలో ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం రాత్రికి చేరుకుంటారని సమాచారం. ఈ కారణంగా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.