న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:06 AM
మా అన్న రాయుడు (శ్రీనివాసులు) హత్యకేసులో న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని కీర్తి ఆవేదనా స్వరంతో చెప్పారు
శ్రీకాళహస్తి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మా అన్న రాయుడు (శ్రీనివాసులు) హత్యకేసులో న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని కీర్తి ఆవేదనా స్వరంతో చెప్పారు. శ్రీకాళహస్తి మండలం బొక్కిసంపాళేనికి ఆదివారం చెన్నైనుంచి మృతదేహం రాగానే అమ్మమ్మ రాజేశ్వరి, సోదరితోపాటు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కీర్తి విలపిస్తూ, మాట్లాడారు. ‘జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా మా అన్న అభిమానించేవాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జనసేన ఇన్‌చార్జి వినుత దంపతుల వద్ద అహర్నిశలు శ్రమిస్తూ వారిఉన్నతి కోసమే తపించేవాడు. ఇటీవల మా అన్న కాలు జారిపడటంతో గాయమైందని వినుత దంపతులు మాకు ఫోన్ ద్వారా చెప్పారు. మేము ఇంటికి వెళ్లి చూడటంతో కాలికి గాయమైంది. మా అన్న శ్రీనివాసులుకు రెండువైపులా ఇద్దరు కూర్చుని మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. మా వ్యక్తిగత విషయాలను రాజకీయ ప్రత్యర్థులకు మీ అన్న చెరవేస్తున్నాడంటూ వినుత దంపతులు మాకు చెప్పారు. తర్వాత మళ్లీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ఇంటికిపంపేశారు. ఆ తరువాత కూడా చాలాసార్లు పిలిపించుకున్నారు. పని కోసం పిలుస్తున్నారని మేం అనుకున్నాం. కానీ చిత్రహింసలకు గురి చేసి హతమార్చేశారు. చెన్నై పోలీసులు చెప్పే వరకు మా అన్న చనిపోయాడన్న విషయం కూడా తెలియదు. వారిని కఠినంగా శిక్షించాలి’ అంటూ కీర్తి కోరారు. కాగా, మృతదేహం రాక సమాచారం తెలుసుకున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు స్నేహితులు, బంధువులు బొక్కిసంపాళెం చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు. వైసీపీ నేత అంజూరు శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు.
నిందితులకు 14రోజుల రిమాండ్
డ్రైవర్ శ్రీనివాసులును హత్య చేశారన్న కేసులో చెన్నైలోని సి3 సెవెన్ వెల్స్ పోలీసులు జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన మాజీ ఇన్‌చార్జి వినుతతోపాటు భర్త చంద్రబాబు, వారికి సహకరించిన శివకుమార్, గోపి, తస్సర్ బాషాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి న్యాయమూర్తి ఎదుట వారిని చెన్నై పోలీసులు హాజరు పరచగా 14రోజుల పాటు రిమాండ్ విధించారు. చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు వీరిని తరలించారు.