పాలసముద్రం ఎస్‌ఐ అత్యుత్సాహం
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:26 AM
రాజకీయ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, వాటిపై నిరసనలు సర్వసాధారణం. జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఈ ఆరోపణలు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలో శనివారం టీడీపీ నాయకులు జీడీనెల్లూరులో, పాలసముద్రంలో నిరసనవ్యక్తం చేశారు.వీటిపై ఎవరి ఫిర్యాదూ లేకపోయినా పాలసముద్రం ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకురాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేసి జీపు ఎక్కించారు
ఫిర్యాదు లేకున్నా ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీపీ కోసం పనిచేస్తున్నారని టీడీపీ ఆరోపణ
చిత్తూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజకీయ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, వాటిపై నిరసనలు సర్వసాధారణం. జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఈ ఆరోపణలు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలో శనివారం టీడీపీ నాయకులు జీడీనెల్లూరులో, పాలసముద్రంలో నిరసనవ్యక్తం చేశారు.వీటిపై ఎవరి ఫిర్యాదూ లేకపోయినా పాలసముద్రం ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకురాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేసి జీపు ఎక్కించారు.
ఎమ్మెల్యే థామస్, మాజీ మంత్రి నారాయణస్వామి ఇటీవల పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.వీటికితోడు ఇటీవల వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటుకున్న ఘటన ఇంకాస్త వేడిని పెంచింది.దీని వెనుక వైసీపీ సర్పంచి గోవిందయ్య హస్తం ఉందని పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత సహా పలువురు ఎమ్మెల్యేలు దేవళంపేటలో ఇటీవల ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ.. ‘నారాయణస్వామి లిక్కర్ స్కామ్‌లో సంపాదించిన సొమ్ము కూతుళ్లకు పంచిపెట్టారు’ అన్నారు. దీన్ని ఖండించిన నారాయణస్వామి కూతురు, నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కృపాలక్ష్మి శుక్రవారం కార్వేటినగరం పోలీసులకు ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేశారు. దీంతో పాటు పాలసముద్రం వైసీపీ నాయకురాలు రమాదేవి కూడా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన టీడీపీ నాయకులు శనివారం జీడీనెల్లూరులో కృపాలక్ష్మికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. పాలసముద్రం మండలం నరసింహాపురం కూడలిలో కూడా తెలుగు మహిళలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేసి కృపాలక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు.నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఎమ్మెల్యేపై బురద చల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆరోపించారు.ఈ నిరసనల ఫొటోలను టీడీపీ మండల, నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు.
ఇళ్లకు వెళ్లి.. జీపులో ఎక్కించి..
పాలసముద్రంలో జరిగిన నిరసనల్ని వాట్సాప్‌లో చూసిన అక్కడి ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప ఆ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు రాజేశ్వరి, పెనుమూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జ్యోతి, పుంగోడి ఇళ్లకు వెళ్లి వారిని జీపులో ఎక్కించుకున్నారు.ఈ సమాచారం అందిన టీడీపీ మండల నాయకులు తాళ్లూరి శివానాయుడు, పెనుమూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు అరుళ్‌నాథన్, ఎస్సీ నేత సాంబశివన్ తదితరులు నరసింహాపురానికి చేరుకున్నారు. ఎవరు ఫిర్యాదు చేశారని తెలుగు మహిళలను అరెస్టు చేశారంటూ ఎస్‌ఐని గట్టిగా నిలదీశారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, నగరి డీఎస్పీ అజీజ్‌లకు అక్కడి నుంచే ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మందలింపుతో మహిళల్ని వదిలి ఎస్‌ఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం ఎమ్మెల్యే థామస్ వరకు వెళ్లడంతో ఆయన ఎస్పీ తుషార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కూడా ఎస్‌ఐ చిన్నరెడ్డప్పను మందలించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేను తిట్టిన వైసీపీ మహిళా నేత పట్ల సానుకూలత
పాలసముద్రం మండల వైసీపీ నాయకురాలు రమాదేవి శుక్రవారం ఎమ్మెల్యే థామస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. నిరసన వ్యక్తం చేసిన తెలుగు మహిళల్ని ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేసిన ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప, ఏకంగా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినా రమాదేవిని ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.