రైతును బలిగొన్న గజరాజులు
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:21 AM
ఏనుగులు మరో రైతును పొట్టనబెట్టుకున్నాయి. జిల్లాలో రోజూ ఎక్కడో ఒకచోట పంటలపై దాడి చేసి తొక్కి నాశనం చేస్తున్న ఏనుగులు అటవీ సమీప ప్రాంతాల రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడప్పుడూ రైతులనూ తొక్కి చంపేస్తున్నాయి.ఈసారి కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానపల్లెకు చెందిన రైతు కిట్టప్ప(64) ఒంటరి ఏనుగు దాడితో ప్రాణాలు కోల్పోయాడు.
కుప్పం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఏనుగులు మరో రైతును పొట్టనబెట్టుకున్నాయి. జిల్లాలో రోజూ ఎక్కడో ఒకచోట పంటలపై దాడి చేసి తొక్కి నాశనం చేస్తున్న ఏనుగులు అటవీ సమీప ప్రాంతాల రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడప్పుడూ రైతులనూ తొక్కి చంపేస్తున్నాయి.ఈసారి కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానపల్లెకు చెందిన రైతు కిట్టప్ప(64) ఒంటరి ఏనుగు దాడితో ప్రాణాలు కోల్పోయాడు.రాగి, జొన్న పంటలను సాగు చేసిన కిట్టప్ప అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటంతో వాటినుంచి పంటలను కాపాడుకునేందుకు పొలం వద్దే వున్న చిన్నపాటి గుడిసెలో రాత్రిపూట పడుకుంటున్నాడు.సమీప అటవీప్రాంతంలో కొన్ని రోజులుగా ఆరు ఏనుగులు సంచరిస్తూ పంటలకు నష్టం కల్గిస్తున్నాయి. వాటినుంచి విడిపోయిన ఒక ఏనుగు గురువారం తెల్లవారుజామున కిట్టప్ప పొలం వైపు వచ్చింది. ఏదో జంతువు వస్తున్నట్లు అలికిడి కావడంతో కిట్టప్పకు మెలకువ వచ్చింది.అది ఏనుగని తెలియక బెదిరించే క్రమంలో అదిలించడంతో ఏనుగు గుడిసెను తోసి తొక్కి వెళ్ళిపోయింది.లోపలున్న కిట్టప్ప ప్రాణాలు కోల్పోయిన విషయం ఉదయం గమనించిన కుటుంబీకులు కన్నీళ్ళపర్యంతమయ్యారు.ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని కిట్టప్ప మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు డీఎఫ్‌వో శ్రీనివాసులు కూర్మానపల్లెకు చేరుకుని కిట్టప్ప భార్య, పిల్లలను పరామర్శించారు. తక్షణ సాయంగా ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. మరో రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొంతకాలంగా ఏనుగులు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పొలాలపై వరుస దాడులకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిట్టప్ప కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ భరోసా ఇచ్చారు.అలాగే ఏనుగుల దాడుల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, రేంజర్ జయశంకర్ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండండి:డీఎఫ్‌వో
కుప్పం అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉండే ప్రజలు ఏనుగుల దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు డీఎఫ్‌వో శ్రీనివాసులు హెచ్చరించారు.అటవీశాఖ అధికారులు సూచించే విధంగా నడచుకోవాలన్నారు. పంటలను కాపాడుకునే క్రమంలో ఎవరూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.