Share News

భూమనకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:26 AM

తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి పాపాలు పండి, కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది’

భూమనకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌

తిరుపతి, ఆగస్టు10(ఆంధ్రజ్యోతి): ‘ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. ఇక్కడి వారిని వేధించుకుతింటున్నారు. వారి పాపాలు పండి, కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది’ అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల దళిత యువకుడు పవన్‌ కుమార్‌ను భూమన అనుచరులు అనిల్‌ రెడ్డి, జగ్గా రెడ్డి, దినే్‌షతో చిత్రహింసలు పెట్టిన వీడియో చూసి అందరూ నివ్వెరపోయారు. కేసు నమోదు చేశాక మళ్లీ బెదిరించి, మా అన్నే కొట్టాడని బాధితుడి చేత చెప్పించారు. కిడ్నాపర్ల చెర నుంచి పవన్‌ను పోలీసులు రక్షించి, నిందితులను రిమాండ్‌కు పంపారు. ఈ అఘాయిత్యాన్ని వెనుకనుంచి నడిపించిన తండ్రీ కొడుకులను విడిచిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. జెరాక్స్‌ షాపు పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ భూమనను పట్టాభి ప్రశ్నించారు. ‘మీ భూకబ్జాలు, అవినీతి, అక్రమాలపై మా దగ్గర ఆధారాలున్నాయి. స్వర్ణముఖి నదీపరీవాహక ప్రాంతంలో (సర్వేనెంబరు 479) 9 ఎకరాలు కబ్జా చేసింది నిజంకాదా? 472,3,4లో 15.64 ఎకరాలు భూమి ఉంటే దానికి అనుగుణంగా నదీగర్భాన్ని కూడా మట్టితో పూడ్చేశావు. కబ్జా చేయలేదని నిరూపించే శక్తి నీకుందా? మీడియా ముందు నీతికథలు చెబుతూ...తెరవెనుక అంతుపట్టని అక్రమాలు చేస్తావు. టీటీడీ, తుడా ఛైర్మన్‌గా ఉన్నప్పుడే 21 ఆస్తులు కొనుగోలు చేసినట్టు నువ్వే ఎలక్షన్‌ అఫిడవిట్‌లో చూపించావు. మాస్టర్‌ ప్లాన్‌ పేరిట టీడీఆర్‌ బాండ్ల కుంభకోణానికి తెరలేపారు. టీడీఆర్‌ బాండ్ల అవినీతిపై విచారణ పూర్తయింది. ఏతండ్రైనా కొడుకును ప్రయోజకుడు చేయాలని చూస్తారు. నువ్వేమో పరమ బడుద్దాయిలాగా తయారు చేశావు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో అప్పటి డీసీ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డిని అడ్డుపెట్టుకుని దాదాపు 35వేల దొంగ ఓట్లు తయారు చేయలేదా? ఈసీ విచారణలో నిర్ధారణ కావడంతో డీసీని సస్పెండ్‌ చేయడంతో పాటు ఓ ఐఏఎస్‌ అధికారిపై మచ్చపడలేదా? దీనివెనుక సూత్రధారులు మీరు కాదా? మీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆధారాల సహా తండ్రీ కొడుకులను ఒకే జైలుకు పంపుతాం’ అని పట్టాభి అన్నారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని తండ్రీ కొడుకులు భ్రష్టు పట్టిస్తూ కూటమి ప్రభుత్వంపై లేనిపోని అబాండాలు వేస్తున్నారని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మండిపడ్డారు. ఎన్ని నాటకాలు వేసినా భూమన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదని డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీధర్‌ వర్మ, సుబ్బు యాదవ్‌, అత్తులూరి ఆనంద్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:26 AM