Share News

మారిన జిల్లా రూపు

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:29 AM

జిల్లా పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఆదివారం సీఎంతో జరిగిన సమీక్షలో జరిగిన చివరి మార్పులే ఫైనల్‌ అయ్యాయి. సోమవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలు యధాతదంగా అమల్లోకి వచ్చాయి.

మారిన జిల్లా రూపు

పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌ జారీ

నేటి నుంచే అమల్లోకి..

తిరుపతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఆదివారం సీఎంతో జరిగిన సమీక్షలో జరిగిన చివరి మార్పులే ఫైనల్‌ అయ్యాయి. సోమవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలు యధాతదంగా అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు జిల్లాల పునర్విభజన తుది నోటిఫికేషన్‌ మంగళవారం జారీ చేసింది. బుధవారం నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి రానున్నాయి. దాని ప్రకారం జిల్లా నుంచీ గూడూరు నియోజకవర్గాన్ని పాక్షికంగా నెల్లూరు జిల్లాలో కలిపారు. ఆ నియోజకవర్గంలో ఐదు మండలాలుండగా గూడూరు, కోట, చిల్లకూరు మండలాలను నెల్లూరుకు కలిపారు. మిగిలిన వాకాడు, చిట్టమూరు మండలాలు రెండూ తిరుపతి జిల్లాలోనే కొనసాగుతాయి. గూడూరు కేంద్రంగా వున్న రెవిన్యూ డివిజన్‌ కూడా నెల్లూరుకు తరలిపోవడంతో ఇప్పటి దాకా అందులో ఉన్న వాకాడు, చిట్టమూరు మండలాలను సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజన్‌కు చేర్చారు. వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు మూడూ ఇప్పటి దాకా గూడూరు డివిజన్‌లో వుండేవి. వాటిని తాజాగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి కలిపారు. ఇలా జిల్లాలో సర్దుబాట్లు జరిగాయి. మరోవైపు అన్నమయ్య జిల్లాలో భాగంగా వున్న రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేశారు. ఈ నియోజకవర్గంలో రైల్వే కోడూరు, చిట్వేలు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు మండలాలున్నాయి. ఈ మండలాలను తిరుపతి రెవిన్యూ డివిజన్‌ పరిధిలో చేర్చారు. రాజకీయంగా చూస్తే రైల్వే కోడూరు తొలి నుంచీ టీడీపీకి కంచుకోట. పాక్షిక లేదా సంపూర్ణ నియోజకవర్గాలా అన్నది పక్కన పెడితే జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్య మూడు నుంచీ నాలుగుకు పెరిగింది. సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడూరుతో పాటు ఇప్పుడు కొత్తగా రైల్వే కోడూరు వచ్చి చేరింది.

జిల్లా రూపు మారిందిలా..

మండలాలు: 34 నుంచి 36కు పెరుగుదల

రెవెన్యూ డివిజన్లు: 4 నుంచి 3కు తగ్గుదల

నియోజకవర్గాల సంఖ్య: 9

పూర్తిస్థాయి నియోజకవర్గాలు: చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, రైల్వే కోడూరు

పాక్షికం: నగరి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు

జనాభా: 29.04 లక్షల నుంచి 29.47 లక్షలకు పెరుగుదల

ఉద్యాన పంటలు: బొప్పాయి, మామిడి, అరటి పంట చేరాయి.

సహజ వనరులు: ముగ్గురాళ్ల గనులు, బెరైటీస్‌ కొత్తగా చేరాయి

Updated Date - Dec 31 , 2025 | 01:29 AM