Share News

టీడీపీలో మార్పు అధ్యక్షుడికా? ప్రధాన కార్యదర్శికా?

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:09 AM

అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేకు మించి దాదాపు మంత్రి హోదాను అనుభవిస్తూ ఉంటారు.

టీడీపీలో మార్పు అధ్యక్షుడికా? ప్రధాన కార్యదర్శికా?

చిత్తూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేకు మించి దాదాపు మంత్రి హోదాను అనుభవిస్తూ ఉంటారు. అమరనాథరెడ్డి, పులివర్తి నాని, గౌనివారి శ్రీనివాసులు.. ఇలా చాలామంది అధికార పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసే ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికే గ్రామ, మండల కమిటీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో.. నాలుగైదు రోజుల్లో జిల్లా కమిటీ ఎన్నికల్నీ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్దేశించింది. జిల్లా ప్రాతిపదికగా అధ్యక్షులు ఉంటారా లేక ఇప్పుడున్నట్టుగానే పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు ఉంటారా అనే స్పష్టత లేదు. అయినా ఆశావహుల జాబితా మాత్రం చాలానే ఉంది.

జిల్లా ప్రాతిపదికనేనా?

ప్రస్తుతం టీడీపీ పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులున్నారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా చంద్రగిని నియోజకవర్గానికి చెందిన సీఆర్‌ రాజన్‌, ప్రధాన కార్యదర్శిగా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన కోదండయాదవ్‌ ఉన్నారు. అయితే చిత్తూరు పార్లమెంటులోని చంద్రగిరి తిరుపతి జిల్లాలో ఉండడం, నగరి కూడా సగం తిరుపతిలోనే ఉండడం, పుంగనూరును అన్నమయ్య జిల్లాలోకి కలిపే ప్రతిపాదనలు ఉండడం.. వంటి కారణాలతో ఈసారి జిల్లాను ప్రాతిపదికన నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇద్దరూ బీసీలే

ప్రస్తుతం ఉన్న అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరూ బీసీలే. అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌కు రాష్ట్ర వన్నియకుల క్షత్రియ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా లభించింది. ఇక కోదండయాదవ్‌ చాలాకాలంగా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకర్ని ఖచ్చితంగా మార్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఓసీ ఒకరు, బీసీ మరొకరు ఉంటారని అంటున్నారు. సీఆర్‌ రాజన్‌కు ఇప్పటికే పదవి ఇచ్చారు కాబట్టి, పార్టీ అధ్యక్షుడిగా వేరేవారికి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ జిల్లా ప్రాతిపదికన అధ్యక్షుడిని ఎంపిక చేస్తే సీఆర్‌ రాజన్‌ తిరుపతి పరిధిలోకి వెళ్లిపోతారు.

ఆశావహుల జాబితా పెద్దదే..

చిత్తూరు రూరల్‌ మండలానికి చెందిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి భర్త చంద్రప్రకాష్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. బంగారుపాళ్యానికి చెందిన ఎన్‌పీ జయప్రకాష్‌ అధ్యక్ష పదవి కోరుతున్నా, వీలుకాకపోతే ప్రధాన కార్యదర్శి అయినా పర్లేదని భావిస్తున్నారని చెబుతున్నారు. డీసీసీబీ అధ్యక్ష పదవి ఆశించిన ఈయనకు ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. ఇక మంత్రి అచ్చెన్నాయుడి అండతో నగరికి చెందిన విజయ్‌బాబు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని అంటున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్‌ భీమినేని చిట్టిబాబు, ఐరాల మండల అధ్యక్షుడు గిరి, తవణంపల్లెకు చెందిన వెంకటేష్‌ చౌదరి పేర్లు కూడా అధ్యక్ష, కార్యదర్శి పదవుల ఆశావహుల్లో ఉన్నాయి. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కాజూరు బాలాజి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడ్ని మార్చిన ప్రతిసారీ జిల్లా యువత అధ్యక్షుడ్ని కూడా మార్చుతూ వస్తున్నారు. ప్రస్తుతం యువత అధ్యక్షుడిగా ఉన్న కాజూరు రాజేష్‌ కొనసాగుతారా.. లేదా.. అనేది జిల్లా అధ్యక్షుడి మార్పు మీద ఆధారపడి ఉంటుంది.

రెండు, మూడ్రోజుల్లో నామినేటెడ్‌ పదవులూ..

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవికి మాపాక్షికి చెందిన వెంకటేష్‌ యాదవ్‌ పేరు ఖరారు అయినా, రిజర్వేషన్లలో భాగంగా మహిళలకు కేటాయించడంతో వెంకటేష్‌ యాదవ్‌ సతీమణికి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించనున్నారని అంటున్నారు. అలాగే ఎన్నికల్లో క్లస్టర్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన త్యాగరాజన్‌కు రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఖరారైందని చెబుతున్నారు. వీటితోపాటు గ్రంథాలయ చైర్మన్‌, కోఆపరేటివ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ చైర్మన్‌ పదవుల్ని కూడా భర్తీ చేస్తారని తెలుస్తోంది.

Updated Date - Jul 14 , 2025 | 12:10 AM