పక్షుల పండుగ రెండు రోజులే..!
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:49 AM
సూళ్లూరుపేట కేంద్రంగా ఏటా మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిపే పక్షుల పండుగ ఈసారి రెండు రోజులే నిర్వహించనున్నట్లు సమాచారం. 2000 నుంచి ఏటా మూడు రోజుల పాటు పక్షుల పండుగ నిర్వహిస్తున్నారు.
ఇరకం, ఉబ్బలమడుగు సహా 7 ప్రాంతాల్లో నిర్వహణ
తడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట కేంద్రంగా ఏటా మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిపే పక్షుల పండుగ ఈసారి రెండు రోజులే నిర్వహించనున్నట్లు సమాచారం. 2000 నుంచి ఏటా మూడు రోజుల పాటు పక్షుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం పాత పద్ధతినే కొనసాగించారు. అయితే వచ్చే ఏడాది జనవరి 10, 11 లేదా 17, 18 తేదీల్లో పక్షుల పండుగ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంటే రెండు రోజులే నిర్వహించనున్నారు. గత వారం కలెక్టరేట్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం సుమారు రూ.3 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. గతేడాది సూళ్లూరుపేట, నేలపట్టు, అటకానితిప్ప, భీములవారిపాళెం, శ్రీసిటీలో పక్షుల పండుగ జరపగా, ఈ దఫా ఇరకందీవి, వరదయపాళెం మండలంలోని ఉబ్బలమడుగు జలపాతం వద్ద కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇరకందీవిలో కాట్ ఎయిర్ బెలూన్, ఏరో స్పోర్ట్స్, ఉబ్బలమడుగులో ప్రెకింగ్, జలపాతాల వీక్షణ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. కాగా, పక్షుల పండుగకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.